భలే మంచి చౌకబేరము! | Sakshi
Sakshi News home page

అమరావతిలో సింగపూర్‌ కంపెనీలకు..భలే మంచి చౌకబేరము!

Published Wed, Jun 6 2018 2:51 AM

Over Rs 6,623 crores loss to the government treasury in Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వ పెద్దలు స్వప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్నారు. సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలకు అపరిమిత లబ్ధి చేకూర్చడంతోపాటు భూములివ్వని రైతులను దగా చేస్తున్నారు. రాజధానిలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరాకు రూ.4 కోట్ల ధరతో భూములు కేటాయించిన రాష్ట్ర సర్కారు సింగపూర్‌ కంపెనీలపై మాత్రం ఎనలేని ఔదార్యం ప్రదర్శిస్తోంది. అమరావతిలో సింగపూర్‌ కంపెనీలతో కలిసి చేపట్టనున్న స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుకు కేటాయించిన భూముల విలువ ఎకరాకు కేవలం రూ.12.02 లక్షలేనని తేల్చేసింది. అంతేకాదు రూ.47.05 కోట్ల విలువైన స్టాంప్‌ డ్యూటీ, పవర్‌ ఆఫ్‌ అటార్నీ స్టాంప్‌ డ్యూటీ మినహాయింపులు కూడా ఇచ్చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్‌మోహన్‌ సింగ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

మొత్తం విలువ రూ.140.62 కోట్లే 
రాజధానిలో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, నాబార్డు వంటి సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.4 కోట్ల ధరతో భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలకు కూడా ఎకరానికి రూ.4 కోట్ల ధరతోనే భూములిస్తామని సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు పేరిట సింగపూర్‌ కంపెనీలకు అమరావతిలో 1,691 ఎకరాలు కేటాయించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు ఎకరాకు రూ.4 కోట్లు అయితే, ఈ మొత్తం భూముల విలువ రూ.6,764 కోట్లు. కానీ, ఎకరాకు రూ.12.02 లక్షలు మాత్రమేనని నిర్ధారించడంతో ఈ భూముల విలువ కేవలం రూ.140.62 కోట్లు కానుంది. అంటే ప్రభుత్వ ఖజానాకు రూ.6,623.38 కోట్లు నష్టం వాటిల్లుతోంది. 

సొంత లాభమే ముఖ్యం 
రాజధానిలో ప్రభుత్వ పెద్దలు విదేశీ కంపెనీలకు అత్యంత తక్కువ ధరకే భూములివ్వడం వెనుక రెండు కారణాలున్నాయని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) వర్గాలు చెబుతున్నాయి. ఒకటి తక్కువ ధరకే భూములిచ్చి, సింగపూర్‌ కంపెనీలకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చి అందులో స్వలాభం చూసుకోవడం. రెండోది ఎకరా విలువ రూ.12.02 లక్షలేనని తేల్చడం ద్వారా రాజధాని ప్రాంతంలో ఇప్పటిదాకా భూములివ్వని రైతుల నుంచి అదే ధరకు భూములు లాక్కోవడం. 

మినహాయింపులే.. 
అమరావతిలో సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలు 1,691 ఎకరాల్లో చేపట్టే స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు వ్యయం రూ.3,137 కోట్లుగా పేర్కొన్నారు. ప్రాజెక్టు విలువలో 0.5 శాతం స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రూ.15.68 కోట్లు అని స్పష్టం చేసింది. అలాగే సింగపూర్‌ కంపెనీలకు జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ కూడా ఇచ్చేసింది. దీనికి స్టాంప్‌ డ్యూటీ కింద ఒక శాతం మినహాయింపు ఇచ్చారు. ఇది రూ.31.37 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్టు విలువలో స్టాంప్‌ డ్యూటీ, జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ స్టాంప్‌ డ్యూటీ మొత్తం మినహాయింపు రూ.47.05 కోట్లు అన్నమాట! 

రాజధాని అమరావతిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూమి ధరలు(ఎకరాకు) 
- ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా: రూ.4 కోట్లు
- లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా: రూ.4 కోట్లు
- స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా: రూ.4 కోట్లు
- ఆంధ్రా బ్యాంకు: రూ.4 కోట్లు
- బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: రూ.4 కోట్లు
- నాబార్డు: రూ.4 కోట్లు
- న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ: రూ.4 కోట్లు
- హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌: రూ.4 కోట్లు
- సిండికేట్‌ బ్యాంకు: రూ.4 కోట్లు
- ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా: రూ.4 కోట్లు  

Advertisement
Advertisement