పౌష్టికాహార లోపం మన్యాన్ని తీవ్ర స్థాయిలో వెంటాడుతోంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, బాలలకు బలవర్ధకమైన ఆహారం అందనంత ఎత్తులో ఉంటోంది.
=127 మారుమూల పల్లెల్లో పౌష్టికాహారం కరువు
=ఏడాదిగా ప్రారంభం కాని మినీ అంగన్వాడీలు
=కానరాని సిబ్బంది పోస్టుల భర్తీ
=అంతంత మాత్రంగా పొరుగు సెంటర్ల సేవలు
=గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందని పౌష్టికాహారం
పాడేరు, న్యూస్‌లైన్ : పౌష్టికాహార లోపం మన్యాన్ని తీవ్ర స్థాయిలో వెంటాడుతోంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, బాలలకు బలవర్ధకమైన ఆహారం అందనంత ఎత్తులో ఉంటోంది. దాంతో అనారోగ్యం గిరిజనులను వెంటాడుతోంది. ఈ పరిస్థితిని తప్పించడానికి ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా ఆహారం అందిస్తోంది. కానీ చిత్తశుద్ధి లోపం వల్ల అది కూడా అందకుండా పోతోంది.
ఏజెన్సీలోని 127 మారుమూల గూడేల్లో మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ఏడాదిగా పౌష్టికాహరం కరువైంది. గ్రామాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సమస్య ఏర్పడింది. మినీ అం గన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ సిబ్బందిని నియమించకపోవడం చిక్కు సమస్యగా మారింది.
పాడేరు మండలంలో 19, జి.కె. వీధిలో 22, చింతపల్లిలొ 15, కొయ్యూరులో 21,పెదబయలులో 2, అనంతగిరిలో 42, అరకులోయలో 1, హుకుంపేటలో 4 మినీ అంగన్‌వాడీ కేంద్రా లు గత ఏడాది మంజూరయ్యాయి. అయితే సిబ్బంది నియామకాలు మాత్రం సకాలంలో జరగడం లేదు. మినీ అంగన్‌వాడీల మం జూరుకు ముం దు సమీపంలో ఉన్న ప్రధాన అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఆయాలు ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేసేవారు. గర్భిణులు, బాలింతలకు నెలకు సరిపడే పౌష్టికాహార సరకులు ఒక్కసారే అందించేవారు.
మినీ అంగన్‌వాడీలు మంజూరు చేసిన నాటి నుంచి ప్రధాన అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహరం పంపిణీ అంతంత మాత్రంగానే ఉంటోంది. దాంతో గ్రామాల్లో గర్భిణులు, బాలింతలు,చిన్నారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాడేరు మండలంలోని వనుగుపల్లి పంచాయతీ బందపోలం గ్రామంలో ఏడాది నుంచి పౌష్టికాహారం అందడం లేదని గర్భిణులు, బాలింతలు ఆవేదన చెందుతున్నారు. దూర ప్రాంతం నుంచి అంగన్వాడీ ప్రధాన కేంద్రానికి కాలినడకన వె ళ్లలేక పోతున్నామని అంటున్నారు. మరి అధికారులు ఎప్పుడు స్పందిస్తారో?