హోదా ద్రోహులు ఇకనైనా కళ్లు తెరవాలి: చలసాని | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 16 2018 5:55 PM

Opposition Parties Fires On Cm Chandrababu Naidu And BJP - Sakshi

సాక్షి, విజయవాడ : ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ఉన్న ద్రోహులు ఇకనైనా కళ్లు తెరవాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ హితవు పలికారు. హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్‌ విజయవంతమైందని ఆయన విజయవాడలో మీడియాకు తెలియచేశారు. ఇకనైన హోదా ద్రోహులు ప్రత్యేక హోదా సాధనకు సహకరించాలంటూ చురకలంటిచారు. రాష్ట్రానికి హోదా సాధనకై తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పిన ఆయన, ఈ నెల 24న బ్లాక్‌డే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకూ విద్యుత్‌ దీపాలు ఆపేసి చీకటి దినంగా పాటించాలని ప్రజలను కోరారు. తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని, 24 గంటలపాటు జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని చలసాని తెలియచేశారు.

బాబుది రెండు నాల్కల ధోరణి
హదో విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది రెండు నాల్కల ధోరణి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. జపాన్‌ తరహా ఉద్యమాలు చేయాలని చంద్రబాబు చెబుతున్నారని, అవి ఎలా చేయాలో తమకు తెలియదని ఎద్దేవా చేశారు. గతంలో ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేయాలన్న చంద్రబాబు, ఇప్పుడు విజయవాడలో ఎందుకు దీక్ష చేస్తున్నారంటూ నిలదీశారు. చంద్రబాబుకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా జంతర్‌మంతర్‌ వద్ద గానీ, ప్రధాని నివాసం ముందుకానీ దీక్ష చేయాలని సూచించారు. ప్రత్యేకహోదా కావాలన్న బాబు, అంతలోనే మాటమార్చి ప్యాకేజీకి అంగీకరించి సన్మానాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఏప్రిల్‌ 20న ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలో భారీ ర్యాలీ, సభ నిర్వహించనున్నట్లు రామకృష్ణ తెలిపారు.

మోదీ రాష్ట్రాన్ని నిలువునా ముంచారు
ఆంధ్రప్రదేశ్‌ను, ప్రజలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిలువునా ముంచారని సీపీఎం నేత బాబురావు మండిపడ్డారు. హోదా ద్రోహులకు ఏపీ ప్రజలు సమాధి కడతారని, విభజన సమయంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే రాష్ట్ర బీజేపీకి పడుతుందని అన్నారు. హోదా కోసం పిలుపునిచ్చిన బంద్‌కు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాయని, కానీ అధికార టీడీపీ మాత్రం పాల్గొనలేదని తెలియచేశారు. దీన్ని బట్టే చంద్రబాబుకు ప్రత్యేకహోదాపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఆందోళనలు, ఉద్యమాలు చంద్రబాబు చెప్పినట్లే చేయాలంటున్నారని మండిపడ్డారు. హోదా ఉద్యమంలో పాల్గొన్నవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, బెదిరించి ఉద్యమంలో పాల్గొనకుండా కుట్రలు చేస్తున్నారని బాబురావు ఆరోపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement