రెండు లారీలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
సంతమాగులూరు, న్యూస్‌లైన్: రెండు లారీలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిలో ఏల్చూరు సమీపాన ఆదివారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన లారీ చెన్నై నుంచి ఢిల్లీకి టైర్ల లోడుతో వెళుతుంది. ఏల్చూరు సమీపంలోకి రాగానే కృష్ణా జిల్లా కోదాడకు చెందిన బొగ్గు లోడుతో లారీ రాంగ్ రూట్‌లో ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ అబీర్ క్యాబిన్ రేకుల మధ్య చిక్కుకుపోయాడు.
కోదాడకు చెందిన మరో లారీ డ్రైవర్ ఐలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఏ శివనాగరాజు, సిబ్బంది తిరుపాల్‌రెడ్డి, హరి సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కున డ్రైవర్‌ను బయటికి తీసేందుకు ఆ మార్గంలో వచ్చిన ప్రయాణికుల సాయంతో రెండు గంటలపాటు య్రత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో పుట్టవారిపాలెం నుంచి జేసీబీని తెప్పించి ఉదయం ఐదు గంటలకు డ్రైవర్‌ను బయటికి తీశారు. క్షతగాత్రులను 108లో నరసరావుపేట తరలిస్తుండగా మార్గమధ్యంలో అబీర్ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై శివనాగరాజు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.