వాయుకాలుష్యంపై శాస్త్రీయ అంచనా అవసరం | On the need for the scientific assessment of air pollution | Sakshi
Sakshi News home page

వాయుకాలుష్యంపై శాస్త్రీయ అంచనా అవసరం

Oct 16 2015 11:34 PM | Updated on Sep 3 2017 11:04 AM

నగరంలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా పారిశ్రామిక....

స్వతంత్ర సంస్థ ద్వారా కారణాల అన్వేషణ
{పభుత్వ రంగ సంస్థలకు జీవీఎంసీ పార్కుల దత్తత
స్పెషల్ టాస్క్ ఫోర్స్ తొలిసారి భేటీ

 
విశాఖపట్నం : నగరంలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య, నివాస, తీర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిని శాస్త్రీయంగా అంచనా వేస్తేకానీ నియంత్రణకు ఏ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక నిర్ణయానికి రాలేరు. ప్రస్తుతం నగరంలో ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే వాయుకాలుష్య అంచనా పరికరాలున్నాయి. వీటిని నగరమంతా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది...’ అని కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచించింది. కమిటీ తొలి భేటీ శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు అధ్యక్షతన జరిగింది.
 నగరంలో పలు ప్రాంతాల్లో వాయు కాలుష్య స్థాయిని అధ్యయనం చేసి విశ్లేషించి అందుకు కారణమయ్యే సంస్థలను గుర్తించే బాధ్యతలను గీతం విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసే బాధ్యతను పర్యావరణ నిపుణులు ప్రొ.ఎస్.రామకృష్ణారావుకు అప్పగిస్తూ ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక సంస్థలు, కాలుష్య నియంత్రణ మండలి వద్ద లభించే సమాచారంతో పాటు తాము స్వతంత్రంగా కొన్ని ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి కాలుష్య కారకులపై విశ్లేషణ జరపాలని ప్రొ.రామకృష్ణారావును సమావేశం కోరింది. నగరంలో ప్రస్తుత కాలుష్యం జాతీయ సగటు కంటే తక్కువగానే ఉందని కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి ప్రసాద్ వివరించారు.  క్రీడాసదుపాయాల గురించి చర్చిస్తూ ఏదైనా ఒక ప్రాంతంలో కనీసం 20 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లయితే భారీ క్రీడా సముదాయాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు వివరించారు.

అథ్లెటిక్స్, ట్రాక్స్, ఇండోర్ స్టేడియం వంటివాటిని నిర్మించవచ్చునని, ఆ బాధ్యతను తాను చేపడతామని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. ఇక నగర సుందరీకరణలో భాగంగా జీవీఎంసీలోని ప్రధాన పార్కులన్నీ పారిశ్రామిక సంస్థలకు అప్పగించినట్లయితే ఆయా సంస్థలు అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేసే బాధ్యతను జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు అప్పగించారు. అలాగే కేజీహెచ్‌లో ప్రస్తుతం పారిశ్రామిక సంస్థలు ఇవ్వడానికి అంగీకరించిన నిధులతోనే అదనపు భవనాలు నిర్మించేలాప్రణాళిక రూపొందించుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు. సీపీ అమిత్‌గార్గ్, వుడా వైస్ చైర్మన్ టి.బాబూరావు నాయుడు, హెచ్‌పీసీఎల్ జీఎంలు జీఎస్ ప్రసాద్‌శర్మ, విఎస్ షనాయ్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.మధుసూదనరావు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement