మహాదేవా.. మన్నించు!

Officials Negligence of Old Lord Shiva Temples Prakasam - Sakshi

శిథిలావస్థలో పురాతనరామలింగేశ్వరస్వామి ఆలయాలు

శివరాత్రి పర్వదినం నాడు శివునికి నైవేద్యం కరువు

ఆలయ భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతం

పట్టించుకోని దేవదాయశాఖ అధికారులు

మర్రిపూడి: ఎకరాలకు ఎకరాలు మాన్యం భూములున్నాయి.. వాటిపై వేలాది రూపాయల ఆదాయం వచ్చే మార్గం ఉంది. అయినా పురాతన ఆలయాలకు ఆలనాపాలనా కరువైంది. ఏడాదికి ఓమారు వచ్చే మహా శివరాత్రి పర్వదినం రోజు కూడా ఆ లయకారునికి నైవేద్యం సమర్పించే దిక్కు లేకుండా పోయింది. కొండపి మండల పరిధిలోని దేవుడి భూములు ఏళ్ల తరబడి అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానిక టీడీపీ నేతల అండతో కొందరు మాన్యం భూములు యథేశ్చగా దున్నుకుని పైర్లు వేసుకుని అనుభవిస్తున్నారు. దీంతో స్వామి వారి ఆలయాలు ఆదరణ కరువైశిథిల స్థితికి చేరాయి.

శివునికి దూప, దీపాలు కరువు..
మండలంలోని సన్నమూరు గ్రామానికి పడమర దిక్కున పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. పటిష్టంగా రాతి కట్టడమైన ఈ ఆలయం చోళుల కాలంలో నిర్మించినట్లు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం ఆధారంగా తెలుస్తోంది. అప్పట్లో స్వాముల వారికి ధూపదీప నైవేద్యం పెట్టేందుకు ఓ ధర్మకర్తను ఏర్పాటు చేశారు. అప్పట్లో 26 ఎకరాల మాన్యపు భూమిని రామలింగేశ్వర స్వామికి కేటాయించారు. స్వామి వారికి నైవేద్యం సమర్పించే ధర్మకర్తకు ఆ భూమిపై వచ్చే ఆదాయంతో పోషణ జరిగేవిధంగా నిర్ణయించారు.  ప్రస్తుతం ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతో రామలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా శిథిలమైపోయింది. ఆలయం చుట్టూ చిల్ల చెట్లు అల్లుకుపోవడంతో ఆ ప్రదేశంలో అసలు ఓ పుణ్యక్షేత్రం ఉందన్న విషయమే నేటి వారికి తెలియని స్థితి ఏర్పడింది.

ఆక్రమణ చెరలో మాన్యం భూములు..
రామలింగేశ్వరస్వామి ఆలయంలో దొంగలు పడి శివ లింగాన్ని తవ్వేశారు. ప్రతిష్టంచిన ప్రదేశంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్టు  పెద్దలు చెబుతున్నారు. ఆలయం దెబ్బతిని పోవడంతో కొందరు స్వార్ధపరులు ఇదే అవకాశంగా తీసుకున్నారు. సన్నమూరు గ్రామం పరిధిలో సర్వే నంబర్‌ 85లో 25.75 ఎకరాల మాన్యపు భూమిని కొందరు గ్రామానికి చెందిన టీడీపీ నేతల అండదండలతో యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. దాదాపు 30 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ రబీ సీజన్‌లోనూ ఆ మాన్యం భూమిలో కందిపంట సాగుచేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ఎండోమెంట్‌ అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. 

శిథిల స్థితిలో మరికొన్ని ఆలయాలు..
మండలంలో తంగెళ్ల గ్రామంలోని శివాలయానికి దేవుని మాన్యంపు భూమి 65.76 ఎకరాలు ఉంది. ధర్మకర్తను ఏర్పాటు చేశారు. కానీ గుడికి కనీసి వెల్లవేసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నిర్వాహణ సక్రమంగాలేక ఆలయం శిథిలావస్థకు చేరింది. అలాగే మండలంలోని కెల్లపల్లి గ్రామంలో శివాలయంలో 54.42 ఎకరాల దేవుని మాన్యపు భూమి ఉంది. ధర్మకర్తలు ఉన్నా కేవలం నైవేద్యానికే  పరిమితం చేశారు.  కానీ గతంలో ఎన్నడూ శివరాత్రి పండుగ వేడుకలు నిర్వహించిన దాఖలాలు లేవు. అలాగే కాకర్లలో 63 ఎకరాల మాన్యం భూమి ఉన్న శివాలయంలోనూ ఎలాంటి ఉత్సవాలు జరిగిన దాఖలాలు లేవు. రామాయపాలెం శివాలయానికి 18.29 ఎకరాల దేవుని మాన్యపు భూమిని కేటాయించారు. ఇక్కడ నైవేద్యం పెట్టేనాథుడు కరువయ్యారని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. 2008–09 లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్సార్‌ రాష్ట్రంలో రూ.28 వేల ఆలయాలను జీర్ణోద్దరణ చేసి, నైవేద్యానికి నిధులు కేటాయించారు. ఆ సమయంలో కూడా ఈ ఆలయాలను పునరుద్ధరించిన దాఖలాలు లేవు. ఎండోమెంట్‌ అధికారులు స్పందించి అన్యాక్రాంతం అవుతున్న దేవుని మాన్యాలను కాపాడాలని మండల ప్రజలు కోరుచున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top