
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పరిపుష్టం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎన్నికల హామీ మేరకు సహకార రంగాన్ని పునర్‌వ్యవస్థీకరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను లాభాల బాట పట్టించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని 2,051 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నెట్ సౌకర్యంతో సహా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణకు రూ.101.39 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనాలను రూపొందించారు. తెలంగాణలో 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించారు.
గ్రేడింగ్‌కు కసరత్తు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణను అత్యంత ప్రాధాన్య అంశంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బందికి శిక్షణ, జవాబుదారీతనం పెంచడంతో పాటు క్రమం తప్పకుండా ఆడిట్ చేయాలని నిర్ణయించారు. గ్రామ సచివాలయాల సహాయంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయనున్నారు. తరచూ తనిఖీలు నిర్వహించడం ద్వారా సహకార సంఘాల్లో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచనున్నారు. రుణ పరపతి, లాభ నష్టాలు, రికవరీ ఆధారంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార సంఘాలను గ్రేడింగ్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
ఆరు నెలల్లో సిఫారసులు..
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సభ్యులైన రైతులకు పంట రుణాలను ఇవ్వడం, సమర్ధవంతంగా వసూలు చేయడమే కాకుండా ఇతర సేవలు అందించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేలా వీటిని తీర్చిదిద్దేందుకు చర్యలను చేపట్టనున్నారు. దీనిపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు ప్రతిష్టాత్మక సంస్థను ఎంపిక చేసి బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆరు నెలల్లోగాసిఫార్సులు తెప్పించుకుని అందుకు అనుగుణంగా చర్యలను చేపట్టనున్నారు. పంట రుణాలు ఇవ్వడంతో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చేపట్టి నూటికి నూరు శాతం రికవరీ చేస్తే స్వయం ప్రతిపత్తి సాధించవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఐదు జిల్లాల్లో నిరర్థక ఆస్తులు రూ.116.52 కోట్లు
నిరర్ధక ఆస్తుల కారణంగా విజయనగరం, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఆరి్థకంగా బలహీన పడ్డాయి. ఈ ఐదు జిల్లాల్లో కేంద్ర సహకార బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రూ.116.52 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం 2,051 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 1,240 సంఘాలు లాభాల్లో ఉండగా 811 సంఘాలు నష్టాల్లో ఎదురీదుతున్నాయి.