కడప కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కడప కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం అప్సర థియేటర్ నుంచి చిన్నచౌకు వార్డు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆయన నామినేషన్ వేశారు. ఈ ర్యాలీలో ఆయన వెంట రాజం పేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్‌బాష ఉన్నారు.
మా గెలుపు నల్లేరుపై నడకే:
సురేష్‌బాబు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై బండి నడకేనని మేయర్ అభ్యర్థి కె.సురేష్‌బాబు అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనానికి భయపడి ప్రభుత్వం ఏ ఎన్నికలు నిర్వహించడానికి కూడా సాహసించలేకపోయిందన్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలైనా నిర్వహిస్తున్నారని చెప్పారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీలు కడప కార్పొరేషన్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు.
వైఎస్సార్‌సీపీదే విజయం:
ఎమ్మెల్యే కొరముట్ల
రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కిరణ్ ప్రభుత్వం వైఎస్ పథకాలన్నింటినీ తుంగలో తొక్కిందన్నారు. సార్వత్రిక ఎన్నికలను పక్కదారి పట్టించడానికే మున్సిపల్, జెడ్పీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. సాధారణ ఎన్నికల్లో సీమాంధ్రలో 175 సీట్లకుగాను వైఎస్‌ఆర్‌సీపీ 160 సీట్లు కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
జగన్ నాయకత్వం అవసరం:
ఎమ్మెల్యే అమర్‌నాధరెడ్డి
కేంద్ర ప్రభుత్వం అసమర్థ విధానాలు, నిర్ణయాల వల్ల రెండు ముక్కలైన రాష్ట్రానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం అవసరముందని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధరెడ్డి అన్నారు. ఏ ఎన్నికల్లోనైనా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో సువర్ణపాలన వస్తుందన్నారు.
కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్‌బాషా మాట్లాడుతూ కడపలో తాము నిర్వహించిన గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజల మనోభావాలేంటో అర్థమయ్యాయన్నారు. ఎన్నికల్లో విభజనకు పూర్తిగా సహకరించిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఛెర్మైన్ కె.బ్రహ్మానందరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అఫ్జల్‌ఖాన్, యానాదయ్య, సర్వేశ్వరరెడ్డి, బంగారు నాగయ్య, కె.శ్రీనివాసులు, బాలమునిరెడ్డి, బివిటి ప్రసాద్, బి.అమర్‌నాథరెడ్డి, బిహెచ్ ఇలియాస్, పులి సునీల్, ఎంపి సురేష్, సంజీవరాయుడు పాల్గొన్నారు.