ముగిసిన నూజివీడు ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్

సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సీట్ల కేటాయింపు కోసం చేపట్టిన కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ ఏడాది వెనకబడిన అగ్రవర్ణ పేదల కోసం 10 శాతం రిజర్వేషన్లు పెంచాలన్న కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ 39 విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలోని కళాశాలలో ఉన్న 4 వేల సీట్లతో పాటు మరో 400 సీట్లు పెరిగాయి. వాటిని భర్తీ చేసేందుకు కళాశాల యజమాన్యం సోమ, మంగళవారాల్లో విద్యార్థులకు చివరిదశ కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేసింది.

స్పెషల్ కేటగిరి, పీహెచ్‌సీ, స్పోర్ట్స్ కోటాలతో పాటు అగ్రవర్ణ పేదల కోసం కేటాయించిన 400 సీట్లను పూర్తిగా భర్తీ చేసినట్లు ట్రిపుల్ ఐటీ ఆడిషన్స్ కన్వీనర్ ఎస్ఎస్ఎస్‌వి గోపాలరాజు ‘సాక్షి’కి తెలిపారు. అయితే మొదటిదశ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఇంకా 219 సీట్లు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా ఇప్పుడు భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులకు సెప్టెంబర్ 4 నుండి తరగతులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నూతన విద్యార్థుల కోసం ఫ్రెషర్స్‌ పార్టీని  నిర్వహించామని, కార్యక్రమంలో వారికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ(ఆర్‌జేయూకేటీ) ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కెసి రెడ్డి  ఐడీ కార్డులను అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు, శ్రీకాకుళం డైరెక్టర్లు ప్రొఫెసర్ డి. సూర్యచంద్రరావు, హర శ్రీరాములు పలువురు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top