ఎందుకో అంత తొందర? 

Number Of Child Marriages are In Vizianagaram District - Sakshi

సాక్షి, విజయనగరం: కొద్ది రోజుల క్రితం గంట్యాడ మండలంలోని ఓ గ్రామానికి   చెందిన 16 ఏళ్ల బాలికకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం చేయడానికి ఇరువురి తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఓ ఆజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్‌ ట్రోల్‌ఫ్రీ నంబర్‌ 1098కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. సంస్థ సభ్యులు, ఐసీడీఎస్, సచివాలయ సిబ్బంది ఆ గ్రామానికి వెళ్లి వివాహాన్ని నిలుపుదల చేశారు. తాజాగా బొండపల్లి మండలంలోని ఓ గ్రామాని కి చెందిన 17 ఏళ్ల బాలికకు నెల్లిమర్ల మండలానికి చెందిన వ్యక్తితో ఈ నెల 13వ తేదీన వివాహం చేయాలని ఇరువురి తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఓ ఆజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్‌ ట్రోల్‌ ఫ్రీ నంబర్‌కు సోమవారం తెలియజేయడంతో చైల్డ్‌లైన్, డీసీపీయూ, ఐసీడీఎస్, సచివాలయ సిబ్బంది గ్రామానికి వెళ్లి వివాహాన్ని నిలుపుదల చేశారు.  

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా... 
లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా... బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. లాక్‌డౌన్‌ను కొందరు అవకాశంగా మలచుకుని గుట్టుగా పెళ్లిళ్లు చేసేయాలని కొందరు తలస్తున్నారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని ఓ వైపు తెలియజేస్తున్నా... చాలామంది పట్టించుకోవడం లేదు. అక్కడక్కడ కొందరు సమాచారం అందిస్తే అధికారులు వాటిని అడ్డుకోగలుగుతున్నారు. ఇంకా సమాచారం అందని పెళ్ళిళ్లు  ఎన్ని జరిగిపోతున్నాయో తెలియడంలేదు. 

ఆడపిల్లలు కాస్త ఏపుగా పెరిగితే చాలు వెంటనే పెళ్లి చేసేయాలన్న ఆలోచనకు తల్లిదండ్రులు వచ్చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే... మంచి సంబంధం మళ్లీ అలాంటిది దొరుకుతుందో లేదోనని కొందరు... ఓ బాధ్యత తీరిపోతుంది కదా అని మరికొందరు... ఇలా తలోరకంగా సమాధానాలు చెబుతున్నారు. కానీ జరగబోయే నష్టా న్ని మాత్రం వారు అంచనా వేయడం లేదు. ఇలాంటివాటిని అడ్డుకునేందుకే ప్రభుత్వం ఛైల్డ్‌లైన్‌టోల్‌ఫ్రీ నంబర్‌ 1098ని ప్రవేశపెట్టింది. ఈ నంబర్‌కు ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే అధికారులు ఆ వివాహాన్ని అడ్డుకుని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. వారిని చట్టానికి దొరకకుండా చేస్తారు.  

బాల్య వివాహం చేస్తే శిక్ష 
బాల్య వివాహానికి ప్రోత్సహించేవారు... చేసేవారు శిక్షార్హులే. ఈ నేరానికి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.లక్ష వరకు జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. బాల్యవివాహం చేసిన తర్వాత ఆ మైనర్‌ను ఆక్రమ రవాణా చేయడం, దాచేయడానిక ప్రయత్నించడం చట్టరీత్యానేరం. బాల్య వివాహాలను నిషేధిస్తూన్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ఆ ఉత్తర్వులు ఉల్లంఘించి వివాహం హిందూ సంప్రదాయంగా జరిపినా ఆ వివాహం చెల్లదు.  ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో వారెంట్‌ లేదా మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండానే పోలీసులు బాల్య వివాహాలను అపొచ్చు. ఈ చట్టం కింద నేరస్తులకు బెయిల్‌లేని శిక్ష విధిస్తారు. 

సమాచారం వస్తే అడ్డుకుంటాం 
బాల్యవివాహాలు జరుగుతున్న సమాచా రం వచ్చిన వెంటనే నిలుపుదల చేయాలని సీడీపీఓలకు ఆదేశాలు జారీ చేశాం. అంగన్‌వాడీ కార్యకర్తలకు బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పాం. బాల్య వివాహాలు జరుగుతున్న సమాచారం వచ్చి న వెంటనే సిబ్బంది వెళ్లి నిలుపుదల చేస్తున్నారు.  – ఎం.రాజేశ్వరి, పీడీ, ఐసీడీఎస్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top