ఆరోగ్యశ్రీకి నిబంధనాలు

NTR HealthScheme Delayed in Prakasam - Sakshi

విస్తృత పరచని పథకం పరిధి

నిధుల పెంపుపై పెదవి విరుస్తున్న పేదలు

ఆందోళన కలిగిస్తున్న సొంత ఊరిలో రేషన్‌ తీసుకోవాలన్న లింకు

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆకర్షించడానికి చేసే పథకంలా ఆరోగ్యశ్రీలో బడ్జెట్‌ కేటాయింపులు, నగదు చెల్లింపులు ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి నగదును పెంచిన ప్రభుత్వం, పథకంలోని సర్జరీల సంఖ్యను మాత్రం పెంచలేదు. పేదలకు ప్రమాదకర రోగం వస్తే చికిత్స చేయించుకునే తాహతులేక, ఆస్తులు అమ్ముకున్నా ఖరీదైన వైద్యం పొందలేక ప్రాణాలు కోల్పోతున్నారు. సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు అయిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, న్యూరో సర్జరీలు, యాక్సిడెంట్లలో తీవ్రంగా గాయపడిన వారికి అందించే ఐసీయూ చికిత్సలు, గుండెకు చేసే అధునాతనమైన శస్త్రచకిత్సలను ఈ పథకం పరిధిలో చేర్చాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

ఒంగోలు సెంట్రల్‌: నిబంధనల ఆరోగ్యశ్రీ పథకంతో ఆరోగ్యం మెరుగయ్యేదెలా అంటూ పేదలు ప్రభుత్వతీరును విమర్శిస్తున్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రస్తుతం ఈ పథకానికి ఇస్తున్న రూ. 2.50 లక్షలు ఏప్రిల్‌ నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని వల్ల పేద రోగులకు పెద్దగా ఉపయోగంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో..: ఖరీదైన వైద్యం పేదలకు అందించాలన్న ఉద్దేశ్యంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. మొదట్లో 468 జబ్బులతో మొదలైన ఈ పథకం కింద సంవత్సరంలోనే 938 జబ్బులను చేర్చారు. పేదవారు చికిత్స చేయించుకోలేని గుండెజబ్బు నుంచి కాలేయ జబ్బు వరకూ, క్యాన్సర్‌ నుంచి ఏ జబ్బుకైనా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో దీని కింద చికిత్స చేసుకునేలా పథకాన్ని తీర్చిదిద్దారు. జబ్బు బారిన పడిన వారికి చికిత్సతో పాటూ వైద్యం జరిగినన్ని రోజులు భోజనం, రవాణా చార్జీలను సైతం చెల్లించేలా పథకాన్ని రూపొందించారు. అప్పట్లో అనేక మంది దీని ద్వారా ప్రాణాలు కాపాడుకుని వైఎస్సార్‌కు తమ గుండెల్లో గుడికట్టారు.

ప్రస్తుతం జరుగుతున్న తీరు
ప్రస్తుతం 938 జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉండగా వీటిలో 133 జబ్బులకు ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్సలు చేయకూడదని, ప్రభుత్వ వైద్య శాలల్లోనే చికిత్స చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది.
హైదరాబాద్‌ వంటి నగరాల్లో చికిత్స చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కింద   నగదు విడుదల చేయడం లేదు. దీంతో అక్కడి వైద్యశాలలు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రోగులకు వైద్య చికిత్సలను అందించడం లేదు.
సొంత ఊరిలో రేషన్‌ తీసుకుంటేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని లింకు పెట్టారు. దీంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారిని ఈ పథకం కింద వైద్య సాయానికి అనర్హులుగా చేశారు.
కిడ్నీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పథకం వల్ల పెద్దగా ఉపయోగం లేదు.
క్యాన్సర్‌ వస్తే చికిత్సకు కనీసం 8 సార్లుకు పైగా కీమోథెరపీని  చేయించుకోవాలి. అయితే ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వరకే తాము భరిస్తామని, తరువాత ఎవరికి వారే చేయించుకోవాలని నిబంధనను విధించడంతో క్యాన్సర్‌ రోగులు మృత్యువాత పడుతున్నారు.
అతి తక్కువ మంది ఉండే చెవి, మూగ వారికి చేసే కాంక్లియర్‌ ఇన్‌ప్లాంట్స్‌ను మాత్రం పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే అది కూడా ఆసుపత్రులు నెలకు 1 కేసు మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు.
ఇక నరాలు, కాలేయానికి సంబంధించిన శస్త్రచికిత్సలకు ప్రైవేటు వైద్యశాలలు ముందుకు రావడంలేదు. ఇలాంటి అనేక నిబంధనల వల్ల పేద వారు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పలు వైద్య సేవలను పొందలేకపోతున్నారు.
గతంలో ఆరోగ్యశ్రీలో ఉండే 24 గంటల కడుపు నొప్పిని, పసరు తిత్తిలోని రాళ్లకు చేసే శస్త్రచికిత్సలను, ఆడవారికి చేసే పెద్ద శస్త్రచికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకోవాలని నిబంధన విధించారు.
ప్రస్తుతం పథకంలో ఉన్న అర్థం, పర్థంలేని నిబంధనలు ఉంటే పథకం కింద వైద్యశాలలకు ఇచ్చే నగదును పెంచితే పేద రోగులకు ఒరిగేదేమీ లేదు. పథకం పరిధిని విస్త్రత పరిస్తేనే పేద రోగులకు లబ్ధి చేకూరతుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top