బాలికలకు భద్రత ఎక్కడ?

No Safety For Girls in Anantapur Villages - Sakshi

విద్యార్థినుల భవితతో ప్రభుత్వం చెలగాటం

నష్టాల బూచీతో 300 సర్వీసులను రద్దు చేసిన ఆర్టీసీ  

237 పంచాయతీలకు తిరగని ఆర్టీసీ బస్సులు  

వెయ్యికిపైగా గ్రామాలకు బస్సు సౌకర్యం నిల్‌

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే దుస్థితి  

అభద్రతాభావంలో తల్లిదండ్రులు

ఇక్కడ మీరుచూస్తోంది తెలంగాణలోని హజీపూర్‌లో బాలికల మృతదేహాల కోసం బావిలో పోలీసులు గాలిస్తున్న దృశ్యాలు. చదువుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగి వస్తున్న అమాయక విద్యార్థినిలను ఓ మృగాడు లిఫ్టు ఇస్తానంటూ నమ్మబలికి అత్యాచారం చేసి, హతమార్చి ఇలా బావిలో పాతిపెట్టాడు. ఇలా ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థినుల తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. విద్యార్థినిలు నివాసముండే ప్రాంతాల నుంచి స్కూళ్లకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్లనే ఇంతటి దారుణానికి కారణంగా అధికారుల పరిశీలనలో వెల్లడైంది. అనంత జిల్లా వ్యాప్తంగానూ ఆర్టీసీ బస్సులు తిరగని గ్రామాలు వెయ్యికిపైగానే ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ఆటోలు, ద్విచక్రవాహనాల్లో విద్యార్థినులు స్కూళ్లకు వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలోనూ ఇలాంటి దారుణాలు చోటు చేసుకోకముందే ప్రభుత్వం మేల్కొని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. – అనంతపురం న్యూసిటీ

నడకే దిక్కు
మీరు చూస్తున్న ఈ చిత్రంలోని విద్యార్థినిలు తనకల్లు మండలం టి.వంకపల్లి గ్రామానికి చెందిన వారు. ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో రోజూ ఐదే కిలోమీటర్లు కాలి నడకన తనకల్లులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుంటూ ఉంటారు. గ్రామంలో చాలా మంది బాలికలను అంత దూరం కాలినడకన పంపలేక తల్లిదండ్రులు మధ్యలోనే వారి చదువులు మాన్పించేశారు. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉంది. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో అభద్రతా భావానికి గురై ఉన్నత చదువులకు బాలికలు దూరమయ్యారు.   – తనకల్లు

మాకు వేరే మార్గం లేదు  
మా ఊరు తనకల్లుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. స్కూల్‌కి వచ్చేందుకు మాకు ఆర్టీసీ బస్సులు లేవు. ఆటోల సౌకర్యం కూడా అంతంత మాత్రమే. దీంతో కాలినడకన స్కూల్‌కు వెళ్లాల్సి వస్తోంది. మాకు వేరే మార్గమూ లేదు. నడుచుకొంటూ అంత దూరం వెళ్లేటప్పుడు చాలా భయంగా ఉంటుంది.– ఉషా, 9వ తరగతి, టి.వంకపల్లి, తనకల్లు మం‘‘  

ఆటోలే శరణ్యం
ఈ ఆటోలో
వేలాడుతూ వెలుతున్న విద్యార్థినిలు గుమ్మఘట్ట మండలం భూపసముద్రం గ్రామానికి చెందిన వారు. ఈ గ్రామం నుంచి ఎక్కువగా 74 ఉడేగోళం, రాయదుర్గంలోని ఉన్నత పాఠశాలలకు వెళుతుంటారు. వీరికి పాఠశాల సమాయనికి బస్సులు లేక ఇలా ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోంది.  – గుమ్మఘట్ట 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top