
'ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడ లేదు'
తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కె.పార్థసారధి స్పష్టం చేశారు.
విజయవాడ: తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కె.పార్థసారధి స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో పార్థసారధి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మండలం జూపల్లిలో ఉన్న భూమిని 2012లో తన కుమారుడి పేరు మీద కొనుగోలు చేసినట్లు తెలిపారు.
తాళ్లపల్లి సుబ్బారావు అనే వ్యక్తి నుంచి సదరు భూమిని కొనుగోలు చేశానని... అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని పార్థసారధి వెల్లడించారు. తాను భూ కబ్జాకు పాల్పడ్డానని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తలు అవాస్తవమన్నారు. సదరు భూమి విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తానని ఆయన చెప్పారు. తాను అక్రమంగా భూమి కొనుగోలు చేశానని కోర్టులో తేలితే సదరు భూమి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పార్థసారధి ఈ సందర్భంగా ప్రకటించారు.