డెల్టా ఆధునికీకరణ లేనట్టే | no delta modernization | Sakshi
Sakshi News home page

డెల్టా ఆధునికీకరణ లేనట్టే

Nov 16 2013 3:39 AM | Updated on Sep 2 2017 12:38 AM

ఈసారి కూడా డెల్టా కాలువల ఆధునికీకరణ లేనట్టే. కేవలం డ్రెయిన్ల ఆధునికీకరణ.. అది కూడా ఇటీవల జరిగిన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం మార్చి 15కల్లా కాలువలను మూసివేస్తేనే చేయగలమని ఇరిగేషన్ అధికారులు తేల్చి చెప్పేశారు.

 సాక్షి, కాకినాడ :
 ఈసారి కూడా డెల్టా కాలువల ఆధునికీకరణ లేనట్టే. కేవలం డ్రెయిన్ల ఆధునికీకరణ.. అది కూడా ఇటీవల జరిగిన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం మార్చి 15కల్లా కాలువలను మూసివేస్తేనే చేయగలమని ఇరిగేషన్ అధికారులు తేల్చి చెప్పేశారు.  డెల్టా ఆధునికీకరణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ గురువారం సమీక్షించారు. ఉభయగోదావరి జిల్లాల్లో రబీ షార్ట్ క్లోజర్‌లో రూ.150 కోట్ల విలువైన మీడియం, మైనర్ డ్రెయిన్ల ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు షార్ట్ క్లోజర్‌లో డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేమని స్పష్టం చేశారు. ఆధునికీకరణ పనుల ప్రగతిని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణారెడ్డి వివరించారు.
 
 తూర్పున రూ.250 కోట్ల పనులే..
 ఉభయగోదావరి జిల్లాల్లో డెల్టా ఆధునికీకరణకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.3360కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు రూ.550 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. తూర్పుగోదావరిలో రూ.1800 కోట్ల విలువైన పనులకు గాను రూ.824 కోట్ల పనులకు ప్యాకేజీలు ఖరారు కాగా, ఇప్పటి వరకు రూ.250 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి.  జిల్లాలోని ఈస్ట్రన్ డెల్టాలో కాకినాడ, మండపేట కాలువల్లో 30 శాతం, సామర్లకోట, బ్యాంక్ కెనాల్‌లలో 15 శాతం, సెంట్రల్ డెల్టాలో గన్నవరం కెనాల్ పరిధిలో మాత్రమే 40 శాతం ఆధునికీకరణ పనులు జరిగాయి. ఇంకా సెంట్రల్ డెల్టాకు సంబంధించి బ్యాంకు కెనాల్‌తో పాటు అమలాపురం కెనాల్‌కు ప్యాకేజీలే ఖరారు కాలేదు. కోరంగి కెనాల్‌కు ఇటీవలే ప్యాకేజ్ ఖరారైంది. 2012లో సాగుసమ్మె కారణంగా తుల్యభాగ డ్రెయిన్ ఆధునికీకరణ పనులు పూర్తి చేయగలిగామని సీఈ తెలిపారు.
 
 రెండు  లాంగ్‌టెర్మ్ క్లోజర్‌లు అవసరం : సీఈ
 ఈఏడాది పశ్చిమగోదావరిలో 80 వేలఎకరాల్లో ఆయకట్టుకు విరామం ప్రకటించేందుకు రైతులు ముందుకొచ్చినందున వీఎన్‌డబ్ల్యూ, ఉండి కెనాల్‌లను పూర్తి స్థాయిలో ఆధునికీకరించనున్నామని, అదే రీతిలో ఇక్కడ కూడా ఒక లాంగ్‌టర్మ్ క్లోజర్ ఇవ్వగలిగితే మిగిలిన మేజర్ డ్రెయిన్ లతో పాటు కాలువల ఆధునికీకరణ పనులను కూడా చాలా వరకు పూర్తి చేయగలుగుతామని సీఈ చెప్పారు. తూర్పున 20 మేజర్ డ్రెయిన్‌లలో రెండింటి ఆధునికీకరణ పనులూ పూర్తికాగా, మరో ఏడు డ్రెయిన్స్ కు ప్యాకేజీలు ఖరారయ్యాయన్నారు. 45 మీడియం డ్రెయిన్లలో ఇప్పటి వరకు 29 డ్రెయిన్‌లలో పనులు పూర్తి కాగా మిగిలిన 13 డ్రెయిన్లకు ప్యాకేజీలు ఖరారయ్యాయన్నారు.
 
  272 మెనర్ డ్రెయిన్లలో ఇప్పటి వరకు 99 పూర్తి కాగా మిగిలిన 172 డ్రెయిన్ల ప్యాకేజీలు ఖరారయ్యాయన్నారు. రానున్న రబీ షార్ట్‌క్లోజర్‌లో మీడియం, మైనర్ డ్రెయిన్స్‌కు సంబంధించి తూర్పుగోదావరిలో రూ.70 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు త్వరలోనే ఖరారు చేయనున్నామని తెలిపారు. అయితే కచ్చితంగా మార్చి 15 నాటికి కాలువలను మూసివేయగలిగితేనే ఈ పనులు చేయగలుగుతామని చెప్పారు. ఇక మేజర్ డ్రెయిన్‌లతో పాటు కాలువల ఆధునికీకరణ పనులను చేపట్టాలంటే కచ్చితంగా రెండు లాంగ్‌టర్మ్ క్లోజర్స్ అవసరమన్నారు. కాగా తూడు తొలగింపునకు డ్రెయిన్‌లకు రూ.కోటి, సెంట్రల్ డెల్టా పరిధిలోని కెనాల్‌లకు రూ.45లక్షలు, ఈస్ట్రన్ డెల్టా కెనాల్‌లకు రూ.80లక్షలతో టెండర్లు ఖరారయ్యాయని, రెండు రోజుల్లో ఈ పనులు ప్రారంభమవుతాయని ఎస్‌ఈ కాశీవిశ్వేశ్వరరావు తెలిపారు.  
 
 రబీకి పూర్తి స్థాయిలో నీరివ్వండి
 కాగా రానున్న రబీ సీజన్‌లో పూర్తి ఆయకట్టుకు నీరివ్వాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ కోరారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల న్నారు. మోటార్లు అవసరం లేకుండానే నీరందే యాజమాన్య పద్ధతులు పాటించేలా రైతులను చైతన్యపర్చాలని కోరారు. కాలువలను మూసి వేసే ముందుగా తాగునీటి అవసరాల కోసం చెరువులన్నీ నింపాలన్నారు. నీలం, భారీ వర్షాల సమయంలో పడిన గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చాలన్నారు. కాలువలు, డ్రెయిన్‌లలో  చెత్తను, ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగించేలా జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలు, పంచాయతీలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో ఇందిరాసాగర్ ఎడమ కాల్వ ఎస్‌ఈ ఎంటీ రాజు, డ్రైనేజీ ఈఈ టీవీఎస్ నాగేశ్వరరావు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement