ఉపాధి వేదిక

new website for unemployed youth

ఏపీ ఎంప్లాయీమెంట్‌ ఎక్ఛ్సేంజ్‌ ఆధ్వర్యంలో కొత్త వెబ్‌సైట్‌

రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఎన్నో అవకాశాలు

అందుబాటులో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాల సమాచారం

నిరుద్యోగులకు భరోసా

సీతంపేట: నిరుద్యోగులు ఎంప్లాయీమెంట్‌ ఎక్ఛ్సేంజ్‌ల చుట్టూ ఇక తిరగాల్సిన పనిలేదు. కొంచెం కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంటే అన్ని రకాల ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఉపాధి కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానంతో ఇక తప్పాయి. ప్రస్తుతం ఏపీ ఎంప్లాయీమెంట్‌ ఎక్ఛ్సేంజ్‌ కూడా నిరుద్యోగులకు ఆన్‌లైన్‌ విధానంలో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది.

కొత్త వెబ్‌సైట్‌
గతంలో నిరుద్యోగులు ఎంప్లాయీమెంట్‌ ఎక్ఛ్సేంజ్‌లలో పేర్లు నమోదు చేసుకునే వారు. అభ్యర్థుల అర్హతలకు అనుగుణంగా పలు సంస్థల నుంచి ఇంటర్వూ్య కాల్‌లెటర్లు వచ్చేవి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులు ‘ఎంప్లాయీమెంట్‌ ఎక్ఛ్సేంజ్‌ డాట్‌ కమ్‌’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇప్పటికే పలురకాల పోర్టళ్లలో రెజ్యూమ్‌ అప్‌లోడ్‌ చేసి నెలలు గడచినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందేవారు అనేక మంది ఉంటారు. అలాంటి వారికోసం ఈ వెబ్‌ౖసైట్‌ మంచి అవకాశం కల్పిస్తుంది.

ఏపీలో ఉద్యోగ సమాచార వేదికగా...
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఈ వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఈ వెబ్‌పోర్టల్లో ఒక్కసారి పేరు రిజిస్టర్‌ చేసుకుని తమ రెజ్యూమ్‌ను అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. అభ్యర్థి అర్హతలను బట్టి ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది.
ఆయా జిల్లాలు, నియోజకవర్గం, మండలాల వారీగా ఉండే ఉద్యోగాల సమాచారం తెలుస్తుంది.
ప్రైవేట్‌ ఉద్యోగాల సమాచారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం, నోటిఫికేషన్ల సమాచారమంతా ఈ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుంది.
ఈ వెబ్‌సైట్‌లో పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఎటువంటి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని సేవలు ఉచితంగా పొందవచ్చు.
ఉద్యోగులు అవసరమైన కంపెనీ/సంస్థలు/రిక్రూటర్లు కూడా అవసరమైన ఖాళీలు గురించి ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచే అవకాశం కల్పించారు.
దీంతో ఆయా అర్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులు సంబంధిత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఆ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్‌ ఇలా...
అభ్యర్థులు ముందుగా ఏపీ ఎంప్లాయీమెంట్‌ ఎక్ఛ్సేంజ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాలి.
డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఏపీఎంప్లాయీమెంట్‌ఎక్ఛ్సేంజ్‌.కామ్‌లో లాగిన్‌ అయ్యాక వెబ్‌సైట్‌ ముఖచిత్రం కనిపిస్తుంది.
న్యూ జాబ్‌ రిజిస్ట్రేషన్‌ హియర్‌ వద్ద క్లిక్‌ చేయాలి.
జాబ్‌ సీకర్‌ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తు కనిపిస్తుంది.
అక్కడ పేరు, ఈ మెయిల్, మొబైల్‌ నంబర్‌ నమోదు చేయాలి.
తర్వాత కాలమ్‌ వద్ద పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకుని నమోదు చేయాలి. పక్క కాలమ్‌లో రీటైప్‌ పాస్‌వర్డ్‌ వద్ద క్రియేట్‌ చేసుకున్న పాస్‌వర్డ్‌ మళ్లీ ఎంటర్‌ చేయాలి.
జిల్లా, చిరునామా, పిన్‌కోడ్‌ నమోదు చేయాలి.
తర్వాత మీ సర్టిఫికెట్స్‌ అప్‌లోడ్‌ చేయాల్సిన కాలమ్‌ కనిపిస్తుంది. అక్కడ స్కాన్‌ చేసిన సర్టిఫికెట్స్‌ 5 కేబీలోపు అప్‌లోడ్‌ చేయాలి.
వెరిఫికేషన్‌ కోడ్‌ ఎంటర్‌ చేయాలి. తర్వాత సబ్‌మిట్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి.
తర్వాత ఎప్పుడైనా, ఎక్కడైనా ఇక్కడ నమోదు చేసిన ఈ మెయిల్‌ ఐడీ, క్రియేట్‌ చేసుకున్న పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వవచ్చు.

ఏపీ ఎంప్లాయిమెంట్‌ వెబ్‌సైట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top