కొండలకు కోట్లిచ్చిన ఘనులు!

The Neglect Of TDP Government Has Become Curses For Present Government - Sakshi

నాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాకం 

రైతుల నుంచి సేకరించిన భూముల్లో సగం నిరుపయోగమే 

800 ప్లాట్లకు అంచనా వేస్తే 400 పాట్లు దక్కని పరిస్థితి 

కొండలు, గుట్టలున్న భూమికి ఎకరానికి రూ.25 లక్షలిచ్చిన వైనం 

ప్రస్తుతం పేదలకు ఇంటి స్థలాల కోసం కోట్లల్లో అదనపు ఖర్చు 

పలమనేరు: నాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పిదాలు నేటి ప్రభుత్వానికి శాపంగా మారాయి. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కొండలు, గుట్టల భూములు పేదల ఇంటి స్థలాలకు పనికిరాకుండా పోయాయి. నాడు టిడ్‌కో, రెవెన్యూ అధికారులు చేసిన నిర్లక్ష్యానికి నేటి ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి ఇళ్లస్థలాలకు అనువైన స్థలాలను సేకరించాల్సి వస్తోంది. ఈ తంతంగాలన్నీ మాజీ మంత్రి అమరనాథ రెడ్డి హయాంలో పలమనేరులో చోటుచేసుకున్న లీలలు.

ఇంతకీ ఏం జరిగిందంటే.... 
పేదలకు అపోర్టబుల్‌ హౌస్‌ నిర్మాణాలకు నాటి ప్రభుత్వం భూసేకరణకు ఆదేశించింది. దీంతో అప్పటి రెవెనూ అధికారులు, ఏపీ టిడ్‌కో (ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌ షిప్‌ అండ్‌ ఇఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)లు కలసి పట్టణ సమీపంలోని గడ్డూరు వద్ద 1075, 1076, 1069 సర్వే నెంబర్లలో రైతుల నుంచి 8.78 ఎకరాలను భూసేకరణ ద్వారా సేకరించారు. ఈ భూములూ కొండలు, గుట్టలుగా ఉన్నాయి. నిర్మాణాలకు యోగ్యంగా లేవని సంబంధిత ఇంజినీర్లు అప్పట్లోనే తేల్చిచెప్పారు. అయితే ఇవేవీ పట్టించుకోని నాటి మాజీ మంత్రి దర్బార్‌ ఆ భూములనే సేకరించాలని అప్పటి తహసీల్దార్‌కు హుకుం జారీ చేసింది. కొండలు, గుట్టలుగా ఉన్న వాటిని ఎకరా రూ.25 లక్షలతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో 8.78 ఎకరాలకు రూ.2.25 కోట్లను వెచ్చించారు. టిడ్‌కోకు సంబందించిన డీఈ స్థాయి అధికారుల అభ్యంతరాలను కాదని కింది స్థాయి అధికారులు చేపట్టిన భూసేకరణలో భారీగానే చేతులు మారాయనే ఆరోపణలు లేకపోలేదు. 

ఒక్కటీ కట్టలేదు..
ఓ వైపు ఆ భూమిని చదునుకూడా చేయలేదు. గతేడాది ఫిబ్రవరి 17 మాజీ మంత్రి అమరనాథ రెడ్డి మున్సిపల్‌ పాలకవర్గంతో కలసి అక్కడ శిలాఫలకానికి పూజలు చేశారు. అయితే అక్కడ ఓ ఇంటి నిర్మాణం సాగితే ఒట్టు.  ఎన్నికలకు ముందు ఓట్లకోసం జరిగిన నాటకంగా ప్రజలకు తరువాత అర్థమైంది. 

ఇప్పుడేమైందంటే.. 
పేదలకు ఇంటిపట్టాల కార్యక్రమంలో భాగంగా నేటి ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలో నాలుగు వేల మంది దాకా ఇంటి పట్టాలకు సిద్ధం చేసింది. గత ప్రభుత్వం టిడ్‌కో ద్వారా సేకరించిన 8.78 ఎకరాలు దానికి ఆనుకుని 6.40 ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపి 15.18 ఎకరాల్లో సుమారు 800 మందికి ప్లాట్లు కేటాయించాలని భావించింది. అయితే ఈ భూములు కొండలు, గుట్టలుగా ఉండడంతో చదును చేసేందుకు ఇప్పటికి రూ.20 లక్షల దాకా ఖర్చు పెట్టింది. ఇంకో రూ.30 లక్షలు పెట్టినా ఇవి ఇళ్ల నిర్మాణాలకు యోగ్యంగా లేవని తేలింది. సక్రమంగా ఉన్న భూమిలో ప్రస్తుతం 400 ప్లాట్లను మాత్రం సిద్ధం చేశారు. దీంతో మిగిలిన లబ్ధిదారుల కోసం మొరం రెవెన్యూ పరిధిలో మరో 20 ఎకరాల భూమిని రైతుల నుంచి ఎల్‌ఏ ద్వారా సేకరించాల్సి వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3 కోట్ల దాకా వెచ్చించాల్సి ఉంది. దీనికి తోడు టిడ్‌కో సేకరించిన భూమిలో లెవలింగ్‌ కోసం ఖర్చు చేస్తున్న ప్రభుత్వ ధనం వృథా అయినట్టే. ప్రజాధనాన్ని బూడిదపాలు చేసిన ఈ తంతంగంలో జరిగిన అక్రమాలపై నాటి ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసిన అధికారులను, టిడ్‌కో సిబ్బందిని విచారించాల్సిన అవరసం ఉంది. అప్పుడే ఈ వ్యవహారంలో జరిగిన అక్రమాలు బయటపడే అవకాశం ఉందని ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

వృథా జరిగింది నిజమే... 
గత ప్రభుత్వంలో గడ్డూరు వద్ద టిడ్‌కో సేకరించిన భూముల్లో సగం దాకా కొండలు గుట్టలుగా ఉంది. ఇందులోని గట్టులను చదును చేసేందుకు ఇప్పటికే రూ.20 లక్షలు ఖర్చు చేశాం. కాని ప్రయోజనం లేదు. అందుకే ఇళ్ల స్థలాలకోసం అదనంగా భూసేకరణ చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. 
– శ్రీనివాసులు, తహసీల్దార్, పలమనేరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top