నాయకర్ కన్నుమూత


 కాకినాడ రూరల్ : వివాద రహితుడిగా, నిజాయితీపరుడిగా పేరొందిన సంపర మాజీ ఎమ్మెల్యే తిరుమాని సత్యలింగ నాయకర్(80) బుధవారం తెల్లవారుజామున 4.10కు కన్నుమూశారు. కొంతకాలంగా ఈయన అస్వస్థతతో ఉన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగిలో ఉంటున్న కుమారుడు, న్యాయవాది స్వామి నాయకర్‌తో ఉంటున్నారు. ఇంటి వద్దే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య అమ్మాజీ, కుమారుడు స్వామి నాయకర్ ఉన్నారు. సత్యలింగ నాయకర్ సొంతూరు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం. ఈయన 1935 జూన్ 12న తిరుమాని స్వామి, ముత్యాలమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచి ఆయన పేదల సమస్యలపై పోరాడడమే కాకుండా, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. 1968లో సర్పంచ్‌గా ఎన్నికై, ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు.

 

  తాగునీరు, కాలువలపై చెక్క వంతెనలు వంటివి నిర్మించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన సాగించారు. 1983లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం స్థాపించాక ఆ పార్టీలో చేరి, అప్పటి సంపర నియోజకవర్గం (ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గం) నుంచి ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందారు. 1985, 1994లో కూడా సంపర నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. 1986 నుంచి 1989 వరకు రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరించారు. రాష్ట్రంలో మత్స్యకార సమస్యల పరిష్కారానికి కృషి చేసి, వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత నాయకర్‌కే దక్కుతోంది. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషిచేశారు.

 

  పేదవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేయడం, నీతినిజాయితీగా వ్యవహరించడంతో ఆయన ఇటు రాజకీయ వర్గాల్లోను, అటు ప్రజల్లోను మంచివ్యక్తిగా, అవినీతికి ఆస్కారం ఇవ్వని మనిషిగా చెరగని ముద్ర వేసుకున్నారు. భారీగా తరలివచ్చిన జనం : నాయకర్ మరణ వార్త తెలిసిన వెంటనే వందలాదిగా ప్రజలు తూరంగిలోని నాయకర్ ఇంటికి తరలివచ్చారు. బలుసుతిప్ప, కొత్తలంక, బ్రహ్మసమేథ్యం, కందికుప్ప, కాట్రేనికోన, పండి, పోరా, తాళ్లరేవు మండలంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా ఆయన అభిమానులు తరలివచ్చి, నాయకర్ భౌతికకాయానికి నివాళుర్పించారు.

 

 మంచి మనిషిని కోల్పోయాం : చినరాజప్ప

 రాజకీయాల్లో నిజాయితీపరుడిగా, వివాదరహితుడిగా పేరొం దిన మంచి మనిషి నాయకర్ అని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప కొనియాడారు. రాష్ట్ర రాజకీయాల్లో నాయకర్ లాంటి వ్యక్తిని చూడలేమన్నారు. పేదవారి సమస్యలపై నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి నాయకర్ అన్నారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటన్నారు.  ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, మాజీమంత్రి చిక్కాల రామచంద్రరావు, కాకినాడ రూరల్, సిటీ ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, వనమాడి వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు రావు చిన్నారావు, పంపన రామకృష్ణ, అడ్డూరి ఫణీశ్వరరావు, వెంగళి సుబ్బారావు, అనాల సుదర్శన్, జగడం శ్రీహరి, వాసంశెట్టి త్రి మూర్తులు, గరికిన అప్పన్న, కాంగ్రెస్  బీసీ విభాగం రాష్ర్ట అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకుడు పెద్దాడ సుబ్బారాయుడు సంతాపం ప్రకటించారు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top