ప్రగతి చక్రానికి కొత్త ‘కళ’

Nature Beautiful Paintings On RTC Buses - Sakshi

సంస్కృతిని ప్రతిబింబించేలా సొబగులు

వ్యాపార ప్రకటనల స్థానంలో రంజింపజేసే వర్ణచిత్రాలు

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో కొత్త కళ

విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు

గెలుపొందిన చిత్రాలకు  బస్సులపై స్థానం

పాత బస్సుల రీ కండీషనింగ్‌కూ చర్యలు 

ఆర్టీసీ అనగానే.. పాతబడిన, కండీషన్‌లో లేని డొక్కు బస్సులే సహజంగా గుర్తుకొస్తాయి. వాటి రూపం కూడాఆ భావనకు బలం చేకూర్చుతుంది. వెలిసిపోయిన రంగులు, శుభ్రత లోపించడం, వ్యాపార ప్రకటనలతో నిండిపోవడం వంటి దృశ్యాలే కళ్లముందు కదలాడతాయి. ఇప్పుడా పరిస్థితి మారనుంది. రంగురంగుల వర్ణచిత్రాలతో చూడగానే ఆకట్టుకునేలా వాటి రూపం మారనుంది. ఇచ్చిన హామీ మేరకు ఏపీఎస్‌ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. ప్రజారవాణ శాఖను ఏర్పాటు చేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సుల రూపురేఖలను మార్చే దిశగా చర్యలు చేపట్టింది.

మన రాష్ట్ర, తెలుగువారి సంస్కతి సంప్రదాయాలను ప్రతిబింబించే వర్ణరంజితమైన చిత్రాలు.. ఇప్పుడున్న వ్యాపార ప్రకటనల స్థానంలో కనువిందు చేయనున్నాయి. అలాగే డొక్కు బస్సులన్న అపప్రదను తొలగించేందుకు రీకండీషన్‌ కూడా చేయిస్తున్నారు. విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి.. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడంతోపాటు.. బహుమతులు పొందిన చిత్రాలను.. సంబంధిత విద్యార్థి, పాఠశాల పేరుతో సహా బస్సులపై ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ సీఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ చెప్పారు. వర్ణ చిత్రాలతో అలంకరించిన 21 బస్సులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని బస్సుల రూపురేఖలను దశలవారీగా మార్చనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణం): ప్రగతి చక్రం కొత్త ‘కళ’ను సంతరించుకుంటోంది. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన సొబగు లద్దుకుంటోంది. మన పండగలు, దర్శనీయ ప్రదేశాలు, కళలు, రమణీయ దృశ్యాలతో చిత్రీకరించిన బస్సులు ఇకపై కళ్లెదుటే సాక్షాత్కరించనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీఎస్‌ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో భావితరాలకు మన సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేస్తూ ‘మన బస్సు.. మన సంస్కృతి’ పేరిట అందంగా పెయింట్‌ చేస్తున్నారు.

విశాఖ రీజియన్‌లోని 600 బస్సులను దశలవారీగా రీ కండిషన్‌ చేసి, పెయింటింగ్‌ వేయించనున్నారు. ప్రయాణికులను ఆకర్షించేలా.. చూడముచ్చటగా రూపొందిన 21 బస్సులను వాల్తేరు డిపో ప్రాంగణంలో ఏపీఎస్‌ఆర్‌టీసీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌ కమిషనర్‌ మాదిరెడ్డి ప్రతాప్‌రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇకపై బస్సులపై ఎటువంటి అడ్వర్టై ్జజ్‌మెంట్స్‌ కనిపించవు. ఏడాది పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కళలు, పండుగలు, దర్శనీయ ప్రాంతాలను చిత్రీకరించిన పెయింటింగ్స్‌తో ఆర్‌టీసీ బస్సులు రూపుదిద్దుకోనున్నాయి.

 

ఆరు నెలల్లో అన్ని బస్సులకూ కొత్త సొబగులు 
నిర్జీవంగా ఉన్న బస్సులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన పిమ్మట, ప్రజల మనసులకు హత్తుకునేలా స్థానిక కళాకారులచే కళాకృతులను బస్సులపై చిత్రీకరించామని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలల్లో నగరంలోని బస్సులన్నీ కొత్త సొబగులు అద్దుకుంటాయన్నారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో, అందుకు తగినట్లుగా బస్సులకు కొత్త కళను తెస్తున్నామన్నారు. నగరంలో 600 బస్సులున్నాయని, ప్రతి బస్సు రోజుకు 220 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నాయని తెలిపారు. బస్సులన్నింటినీ సంస్కృతి, సంప్ర దాయాలు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతామన్నా రు. ఇది పెద్దగా ఖర్చయిన వ్యవహారం కాదని, నిర్జీవమైన వాహనాలను రీ కండీషన్‌ చేసి పెయింట్లు అద్దడంతోనే కొత్త రూపు సంతరించుకుంటున్నాయని చెప్పారు.

ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కిస్తా 
దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారని ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. తనపై నమ్మకంతో ఆ విభాగానికి తొలి కమిషనర్‌గా నియమించారని, దానిని నిలబెట్టుకుని ఆర్టీసీని కొత్తపుంతలు తొక్కిస్తానన్నారు. తాను ఏయూలోనే చదువుకున్నానని తెలిపారు. అనంతరం డ్రైవర్లు కండక్టర్లతో మాట్లాడారు. మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, డ్రైవర్లు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనకు తెలుసని, వారికి పలు సూచనలు చేశారు. డ్రైవర్లు వేసుకుంటున్న యూనిఫాంపై స్పందిస్తూ టీ షర్ట్స్‌ వేసుకుంటే బాగుంటుదన్నారు.  కార్యక్రమంలో ఈడీ రవికుమార్,  రీజనల్‌ మే నేజర్‌ ఎం.యేసుదానం, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌(అర్బన్‌) సుధాబిందు, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌(రూరల్‌) కె.వెంకట్రావు, డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌(అర్బన్‌) బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌(రూరల్‌) అప్పలనారాయణ, వాల్తేర్‌ డిపో మేనేజర్‌ గంగాధర్‌తో పాటు పలు డిపోల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

కొలువుదీరిన కళాకృతులు
ఆర్టీసీ బస్‌పై చక్కని ఆకృతులు, రమణీయ దృశ్యాలెన్నో సాక్షాత్కరిస్తున్నాయి.  ‘అందాల కైలాసగిరి.. ఆంధ్రప్రదేశ్‌కు అదనపు సిరి’, ‘ప్రకృతి ఒడిలో జీవన పోరాటం’, ‘భారతదేశ అన్నపూర్ణ .. మన ఆంధ్రప్రదేశ్‌’, ‘రైతే మన దేశానికి వెన్నెముక’, ‘డాల్ఫిన్‌ నోస్‌ .. విశాఖ సాగర తీర అద్భుతం’, బాపూ బొమ్మలు, చేనేత వస్త్రాల సోయగం, ‘ఉభయ గోదావరి పెన్నిధి..గోదావరి’, ‘అణువణువునా ప్రకృతి..అందమైన అనుభూతి’, ‘విహంగాల సోయగాలు.. కొల్లేటి సరస్సు’, ‘వివాహ భోజనంబు.. పసందైన వంటకాలు’, ‘అబ్దుల్‌ కలాం కలల కోట .. శ్రీహరికోట’, ‘పక్షి జాతులకు అలవాలం.. పులికాట్‌ సరస్సు’.. అరకు నృత్యం థింసా.. ఇలా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రత్యేకతలు.. కళలు బస్సులపై  కొలువుదీరుతున్నాయి. 

విద్యార్థులకు పెయింటింగ్‌ పోటీలు
ప్రతి జిల్లాలో స్కూల్‌ పిల్లలకు పెయింటింగ్‌ కాంపిటీషన్స్‌ నిర్వహించి, వాటిలో ఉన్నత స్థానంలో నిలిచిన పెయింటింగ్‌లను బస్సులపై చిత్రీకరిస్తూ..పెయింటింగ్‌ వేసిన విద్యార్థి పేరు, స్కూల్‌ పేరు కూడా పెడతామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ముఖ్యంగా డ్రీమ్‌ అ»ౌట్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే అంశంపై పెయింటింగ్స్‌ ఉంటాయన్నారు. అమరావతి సర్వీసులతో పాటు 14.5 మీటర్ల పొడవు గల 18 వోల్వో బస్సులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. వాటికి డాల్ఫిన్‌ నోస్‌పై ఆర్‌టీసీ ఎంబ్లెమ్‌తో కూడిన బొమ్మలు చిత్రీకరించనున్నట్టు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top