నాడు–నేడు, జగనన్న విద్యా కానుకకు జాతీయస్థాయి ప్రశంసలు

National Level Acclaim For AP Government Schemes - Sakshi

జాతీయస్థాయిలో జరిగిన వీడియో చర్చలో ప్రముఖుల అభినందనలు

సాక్షి, గుంటూరు‌: రాష్ట్రంలో పాఠశాల విద్యారంగానికి దశ, దిశ చూపుతూ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న మన బడి నాడు–నేడు, జగనన్న విద్యాకానుక కార్యక్రమాలపై జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ప్రశంసల జల్లు కురిపించారు. న్యూఢిల్లీలోని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ సమాఖ్య (ఏఐపీటీఎఫ్‌) మహిళా చైర్‌పర్సన్‌ గీతా పాండే (ఉత్తర్‌ప్రదేశ్‌) అధ్యక్షతన శనివారం “్ఙకోవిడ్‌–19–బాలికా విద్యపై దాని ప్రభావం, ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలు’’ అనే అంశంపై జాతీయస్థాయిలో వీడియో ఆధారిత చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ (ఆప్టా) మహిళా చైర్‌పర్సన్‌ అనపర్తి పద్మావతి (బొబ్బిలి), వైస్‌ చైర్‌పర్సన్‌ ఎస్‌.వి.ఎల్‌ పూర్ణిమ (శ్రీకాకుళం) పాల్గొన్నారు.

వీరితో పాటు 25 రాష్ట్రాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా చైర్‌పర్సన్లు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు.  లాక్‌డౌన్‌ సమయంలో వివిధ రాష్ట్రాల్లో విద్యాభివృద్ధికి తీసుకున్న చర్యలు, పాఠశాలల్ని పునఃప్రారంభించేందుకు చేపడుతున్న చర్యలతో పాటు ఆన్‌లైన్‌ తరగతులు, పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లల్ని పాఠశాలలకు రప్పించేందుకు ఉపాధ్యాయులు, సంఘాల పాత్ర, మధ్యాహ్న భోజన పథకం అమలు, గ్రామీణ, కొండ ప్రాంతాల్లో పాఠశాలలు పునఃప్రారంభం నాటికి శానిటైజర్లు, మందులు, మాస్‌్కల సరఫరా తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలపై అనపర్తి పద్మావతి, ఎస్‌.వి.ఎల్‌.  పూర్ణిమ మాట్లాడుతూ మన బడి నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు జరుగుతున్న కృషిని వివరించారు.

ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభమైన తరువాత విద్యార్థులకు జగగన్న విద్యాకానుక పేరుతో అందించనున్న కిట్ల గురించి తెలియజేశారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు రాంపాల్‌ సింగ్, సెక్రటరీ జనరల్‌ కమల్‌ కాంత్‌ త్రిపాఠీ అభినందించారని పేర్కొన్నారు. వెబినార్‌లో చర్చించిన అంశాల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆప్టా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.జి.ఎస్‌. గణపతిరావు, కె. ప్రకాశరావు తెలిపారు.    

 వెబినార్‌లో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న మహిళా ఆప్టా ప్రతినిధులు 

 ఏపీ నుంచి చర్చలో పాల్గొన్న 
పద్మావతి,  పూరి్ణమ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top