విద్యార్థిని చితకబాదిన ‘నారాయణ’ టీచర్‌ 

Narayana School Teacher Brutally Beats Student In Kurnool - Sakshi

ఆదోనిలోని పాఠశాల ముందు విద్యార్థి నాయకుల ఆందోళన 

సాక్షి, ఆదోని:  పట్టణంలోని నారాయణ కార్పొరేట్‌ పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు డైరీలో తల్లిదండ్రుల సంతకం తీసుకురాలేదనే నెపంతో ఐదో తరగతి విద్యార్థి బుుషేంద్ర సాయిని చితకబాదింది. గురువారం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు రేణుక, కృష్ణమూర్తి పాఠశాల వద్దకు చేరుకుని.. ప్రిన్సిపాల్‌ పవన్‌మహేష్, ఏజీఎం రామిరెడ్డిని నిలదీశారు. కేవలం సంతకం లేదనే నెపంతో టీచర్‌ విజయలక్ష్మి తమ కుమారుడి చేయిని పురితిప్పి విచక్షణారహితంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు.  చేయినొప్పితో బాధపడుతూ రాత్రంతా నిద్రపోలేదని వాపోయారు. ఫీజుల కోసం ఎప్పుడుపడితే అప్పుడు ఫోన్లు చేసి వేధించే మీరు.. డైరీలో సంతకం లేనప్పుడు ఆ విషయం తమకు ఫోన్‌ చేసి చెప్పవచ్చు కదా అని నిలదీశారు.

ఈ సంఘటనతో పాఠశాల అంటేనే తమ కుమారుడు భయాందోళన చెందుతున్నాడన్నారు. పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి తిరుమలేష్‌ మాట్లాడుతూ నారాయణ పాఠశాలలను బాధ్యతారహితంగా నడుపుతున్నారని, గతంలోనూ పాఠశాలలో విద్యార్థులను హింసించారని తెలిపారు. అలాగే విద్యార్థితో కలిసి పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఏజీఎం స్పందిస్తూ విద్యార్థికి ఎలాంటి చికిత్స అయినా తామే చేయిస్తామని, టీచర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత పాఠశాలను పీడీఎస్‌యూ నాయకులు బంద్‌ చేయించారు. అదేవిధంగా పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని, టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు కూడా ఆందోళన చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top