చినబాబు చిరుతిండి రూ.25 లక్షలండి!

Nara Lokesh Snacks Bill Cross 25 lakhs in Visakhapatnam Airport - Sakshi

ఎలా ఇవ్వాలని తల పట్టుకున్న జిల్లా అధికారులు

2016లో రూ.12 లక్షల బిల్లు చెల్లించిన అధికారులు

ఇంకా రూ.13.44 లక్షల బకాయి

సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం: సహజంగా వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లయిట్‌ టేకాఫ్‌కు సమయముంటే వీఐపీ లాంజ్‌లో కాసేపు సేద తీరతారు. అలాగే ఫ్లయిట్‌ దిగినప్పుడు ఐదు, పది నిమిషాల పాటు తమను కలిసేందుకు వచ్చిన ప్రముఖులతో భేటీ అవుతారు. ఆ సందర్భంగా టీ, కాఫీ, స్నాక్స్‌ తీసుకోవడం సహజం. ఆ మేరకు సర్వ్‌ చేసి.. ఎయిర్‌పోర్ట్‌లో సదరు రెస్టారెంట్లు ఇచ్చిన బిల్లులను జిల్లా ప్రొటోకాల్‌ అధికారులు చెల్లిస్తారు. ఇదంతా ఎక్కడైనా సాధారణమే. కానీ గత ఐదేళ్ళలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబునాయుడు, ఈయన అకౌంట్‌లోనే తనయుడు లోకేష్‌బాబులు టీ, కాఫీ, స్నాక్స్‌ కోసం చేసిన ఖర్చు అక్షరాలా పాతిక లక్షల రూపాయలు.

ఔను.. మీరు చదివింది కరెక్టే.. టీడీపీ నేతలు, అప్పటి మంత్రులతో సహా వారిద్దరూ వచ్చినప్పుడు మొత్తంగా అయిన ఖర్చు పాతిక లక్షలని తేల్చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2016 వరకు దాదాపు రూ.12లక్షల బిల్లులను అప్పటి అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌కు చెల్లించారు. ఇక 2017 నుంచి 2019 మే 31 వరకు అయిన మొత్తం 13,44,484 రూపాయలు. ఈ బిల్లును మాత్రం పెండింగ్‌లో ఉంచారు. ఆ బిల్లు చెల్లించాలంటూ ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యాజమాన్యం అధికారులను సంప్రదిస్తూ వస్తోంది. కానీ అన్నేసి లక్షల బిల్లులు ఎలా చెల్లించాలో అర్ధం కాక ప్రస్తుత జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

లోకేష్‌ బిల్లూ...బాబు అకౌంట్‌లోనే
సహజంగా సీఎం ప్రొటోకాల్‌తో పోలిస్తే మంత్రి ప్రొటోకాల్‌ తక్కువే ఉంటుంది. కానీ గత టీడీపీ హయాంలోని ఐదేళ్ళలో ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు తనయుడు లోకేష్‌ వచ్చినా బాబుకిచ్చే ప్రొటోకాల్‌నే అనుసరించిన అప్పటి అధికారులు ఆ మేరకు టీ. కాఫీ, స్నాక్స్‌ బిల్లులను కూడా ఇబ్బడిముబ్బడి చేసేశారు. మొత్తంగా చంద్రబాబు కంటే లోకేష్‌బాబు వచ్చినప్పుడే బిల్లులు భారీ స్థాయిలో అయ్యేవని తేలింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top