ఇది తగునా బాబూ.. | Naidu, fraud, elem compensation, | Sakshi
Sakshi News home page

ఇది తగునా బాబూ..

Mar 18 2015 2:15 AM | Updated on May 29 2018 11:47 AM

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి(బీఆర్‌జీఎఫ్) మంజూరులో జిల్లాకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది.

అనంతపురం సెంట్రల్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి(బీఆర్‌జీఎఫ్) మంజూరులో జిల్లాకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. కరువు జిల్లాను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు రూ. 26.06 కోట్ల బీఆర్‌జీఎఫ్ నిధులను తన్నుకుపోయారు. ఫలితంగా రూ. 43.91 కోట్లతో జిల్లా పరిషత్ పంపిన ప్రతిపాధనలు చెత్తబుట్టకే పరిమితమయ్యాయి. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ఈ జిల్లాపై ముఖ్యమంత్రికి కరుణ లేకపోవడం శోచనీయమని పలువురు జెడ్పీటీసీలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెలితే.. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ప్రధానంగా అమలవుతున్న పథకాలలో బీఆర్‌జీఎఫ్ ముఖ్యమైనది.

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రతి సంవత్సరం ఈ పథకం ద్వారా రూ. కోట్లు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 90శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కలుపుకుని బీఆర్‌జీఎఫ్‌కు నిధులు విడుదలవుతున్నాయి. జిల్లాకు మంజూరైన ఈ నిధులను జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు, శానిటేషన్, భవన నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలకు మాత్రమే ఈ పథకం ద్వారా నిధులు మంజూరవుతున్నాయి.

రాయలసీమలో అనంతపురం, వైఎస్సార్ జిల్లా, చిత్తూరు, కోస్తాలో విజయనగరం జిల్లాకు మాత్రమే బీఆర్‌జీఎఫ్ నిధులు విడుదలవుతాయి. బీఆర్‌జీఎఫ్ ప్రతిపాదనలు పంపడంలో చిత్తూరు జిల్లా అధికారులు పూర్తిగా వెనుకబడ్డారు.
 ప్రతిపాధనలు కూడా గందరగోళంగా ఉండడంతో ఆ జిల్లా జెడ్పీ సీఈఓ ఢిల్లీకి వెళ్లివచ్చినట్లు సమాచారం. అయితే అన్ని జిల్లాల కన్నా ముందే అనంతపురం జిల్లా పరిషత్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాధనలు వెళ్ళాయి.

అన్ని అంశాలు సక్రమంగా రూపొందించి పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కూడా జిల్లా ప్రజాప్రతినిధులు తీసుకుపోయారు. రూ.43.91 కోట్లకు ప్రతిపాధనలు పంపగా అందులో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ. 32.05 కోట్లు, పట్టణ ప్రాంతాల అభివృద్ధి (మున్సిపాలిటీలకు) రూ.11.86 కోట్లుగా కేటాయించారు. గ్రామీణా ప్రాంతాలకు కేటాయిస్తున్న నిధుల్లో పంచాయతీలకు (50శాతం) రూ. 16.02 కోట్లు, మండల పరిషత్‌లకు(30శాతం) రూ. 9.61 కోట్లు, జిల్లా పరిషత్‌కు (20శాతం) రూ. 6.41 కోట్లుగా విభజించారు.
 
అయితే బీఆర్‌జీఎఫ్ నిధులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబునాయుడు మొండిచెయ్యి చూపడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అందరికన్నా వెనుక ప్రతిపాధనలు పంపినా సీఎం సొంత జిల్లా కావడంతో చిత్తూరుకు నిధులు విడుదల కావడం గమనార్హం.  రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లోటు బడ్జెట్‌తో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలయ్యే బీఆర్‌జీఎఫ్ పథకం ద్వారా జిల్లాకు నిధులొస్తాయని ప్రజాప్రతినిధులంతా భావించారు.

జెడ్పీటీసీ సభ్యులుగా గెలుపొంది ఏడాది కావస్తోందని, ఇంత వరకూ ప్రభుత్వం నుంచి నయా పైసా మంజూరుకాలేదని, కనీసం మంచినీటి కుళాయి వేయించేందుకు కూడా వద్ద నిధుల్లేవని జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బీఆర్‌జీఎఫ్ నిధులకోసం ప్రతిపాదనలు పంపామని, త్వరలో మంజూరవుతాయని ఆశతో నెట్టుకొస్తున్నారు.  సోమవారం ప్రభుత్వ కార్యదర్శి(పంచాయతీరాజ్) జవహార్‌రెడ్డి విడుదల చేసిన జీవో 268తో వారి ఆశలు ఆవిరైపోయాయి. చిత్తూరు జిల్లాకు మాత్రమే ఈ ఏడాది బీఆర్‌జీఎఫ్ అని.. మిగిలిన జిల్లాలకు ఉండకపోవచ్చునని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement