పాలుపోవట్లే..

పాలుపోవట్లే.. - Sakshi

  • కనిపించనినాగులచవితి సందడి

  •  కనుమరుగైన పుట్టలు  దొరకని పూజా సామగ్రి

  •  ‘హుదూద్’ దెబ్బకు కళ తప్పిన మార్కెట్లు

  • సాక్షి, విశాఖపట్నం: హుదూద్ ప్రభావం నాగుల చవితిపై కూడా పడింది. తుపాను దెబ్బ నుంచి జిల్లా వాసులు ఇంకా తేరుకోలేదు. కార్తీక మొదటి సోమవారంనాడు ఈ పండగ కావడంతో ముఖ్యంగా మహిళలు ఆదివారం సాయంత్రమే సామాన్లు సిద్ధం చేసుకుంటారు. పూజాసామగ్రి కొనుగోలుదారులతో మార్కెట్లు కళకళలాడుతాయి. కానీ ఈ సారి ఆ సందడి ఎక్కడా కనబడలేదు. అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, చోడవరం వంటి  పట్టణాల్లోనూ మార్కెట్లు వెలవెలబోయాయి.



    ఈ పండగ పట్ల జనం పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. రోజుకో చోట వెలుస్తున్న రియ ల్ ఎస్టేట్ వెంచర్ల పుణ్యమా అని పల్లెల్లో పుట్టలు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే పట్టణ ప్రాంతంలో కృత్రిమ పుట్టలకు పూజలు చేసే దుస్థితి ఏర్పడింది. ఇటీవల వచ్చిన హుదూద్ తుపాను కారణంగా వేలాది చెట్లు కూలిపోయాయి. వాటి కింద పడి పుట్టలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో సంప్రదాయాన్ని కొనసాగించే పరిస్థితులు కానరావడం లేదు.

     

    అందుబాటులో లేని పూజా సామగ్రి



    నాగుల చవితికి కావాల్సిన పూజ సామగ్రి సైతం మా ర్కెట్‌లో అందుబాటులో లేదు. సాధారణంగా పుట్ట లో పాలు పోయడానికి వెళ్లేటప్పుడు చలివిడి, చిమ్నీ లు, అరటి పళ్లు, పాలు, చెరుకుగడ, కొబ్బరికాయ లు, బుర్రగుంజు, కోడిగుడ్లు, కమల, బత్తాయి తొన లు, గళ్ల తువ్వాలు తీసుకువెళుతుంటారు. సాధారణ రోజుల్లో అయితే ఇవన్నీ దొరికేవి. కొన్ని ఇంటి వద్దే తయారు చేసుకునేవారు. అలా కుదరకపోయినా ప్ర ముఖ స్వీట్ దుకాణాల్లో చిమ్మీ, చలివిడి విక్రయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చలివిడి పిండి, చిమ్నీ ఆడేందుకు పిండిమరలు విద్యుత్ సరఫరా లేక మూలనపడ్డాయి.



    బుర్రగుంజు(ఎండిన తాటిపండులో ఉండే గుజ్జు)తేగల పాతర నుంచి వచ్చేది. ప్రస్తుతం అలాంటి పాతరలే ఎక్కడాలేవు. చెరుకుతోటలు పడిపోవడంతో చెరకు ముక్కలు కూడా లేవు. దీంతో అక్కడక్కడా రైతు బజార్లలో మినహా మార్కెట్లలో ఎక్కడా నాగులచవితికి సంబంధించిన పూజ సామగ్రి, ఇతర వస్తువులు దొరకడం లేదు. టపాసులు కాల్చకుండా కేవలం దీపాలతో దీపావళి జరుపుకున్న నగరవాసులు ఇప్పుడు పాల తో నాగులచవితి జరుపుకోవడం కూడా కష్టంగా మారింది.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top