టీడీపీ ఇన్‌చార్జి పుట్టాకు పెద్ద షాక్‌..! | Sakshi
Sakshi News home page

టీడీపీ ఇన్‌చార్జి పుట్టాకు పెద్ద షాక్‌..!

Published Tue, Mar 12 2019 7:57 AM

Mydukur Incharge Sudhakar Yadav, the party's leaders are are leaving - Sakshi

సాక్షి, చాపాడు : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ను ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఊహించని పెద్ద షాక్‌ తగిలింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన మండల టీడీపీ నాయకుడు వెంకటసుబ్బయ్య అనుచరగణంతో సోమవారం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేసి మెజార్టీ ఓట్లు తెప్పించిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.మండలంలోని నక్కలదిన్నె పంచాయతీలోని తిప్పిరెడ్డిపల్లెకు చెందిన మల్లెం వెంకటసుబ్బయ్య యాదవ్‌తో పాటు 80 కుటుంబాలకు చెందిన టీడీపీ వర్గీయులు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  పార్టీ కండువాలను వేసిన వెంకటసుబ్బయ్య వర్గీయులను ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.

వెంకటసుబ్బయ్యతో పాటు చిన్న ఎల్లయ్య, గంగరాజు, పామిడి రామసిద్దయ్య, కొండయ్య, ఓబయ్య, సి, విజయుడు, బిర్రు ఆంజనేయులుతో 80 కుటుంబాలకు చెందిన టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు రాజకీయాల్లో వచ్చిన పుట్టా సుధాకర్‌యాదవ్‌ తమ సామాజిక వర్గానికి చెందిన వాడనే అభిమానంలో రఘురామిరెడ్డిని కాదని టీడీపీలో చేరారు. ఎన్నికల సమయంలో వెంకటసుబ్బయ్యపై దాడులు కూడా జరిగాయి. ఎన్నికల్లో చిన్న గ్రామమైన తిప్పిరెడ్డిపల్లె టీడీపీకి మెజార్టీ ఓట్లు తెప్పించారు.

అనుచరులతో కలిసి టీడీపీలో చేరడాన్ని పుట్టా వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిసింది.  రెండేళ్లుగా అవమానాలు భరిస్తూ వచ్చానని ఇక విలువల్లేని పుట్టా వద్ద వద్దనుకుని వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వెంటకసుబ్బయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎంపీపీ వెంకటలక్షమ్మ భర్త లక్షుమయ్య, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, నాయకులు రామచంద్రయ్య, సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, రాజు, మురళీ, కిట్టయ్య, రమణారెడ్డి, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement