‘మా నాన్నే.. నా స్నేహితుడు’ | My Dad Is My Friend-Short Film | Sakshi
Sakshi News home page

మా నాన్నకు అంకితం..

Jun 15 2019 10:42 AM | Updated on Jun 15 2019 10:42 AM

My Dad Is My Friend-Short Film - Sakshi

లఘు చిత్రంలో ఓ సన్నివేశం 

కొత్తపేట(తూర్పు గోదావరి) : భార్య మాట విని తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్చకుండా ‘మా నాన్నే నా స్నేహితుడు’ అని అక్కున చేర్చుకున్న కొడుకు ఔన్నత్యంతో రూపొందించిన లఘు చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఆదివారం ‘ఫాదర్స్‌ డే’ను పురస్కరించుకుని కొత్తపేటకు చెందిన పెద్దింటి కృష్ణవంశీ తన స్నేహితులు గొర్రెల సాయిమణికంఠ, కుంచెనపల్లి ఆదిత్య, చోడపనీడి ఏసురత్నం తదితరులతో కలిసి ‘నాన్నే నా స్నేహితుడు’ టైటిల్‌తో లఘు చిత్రాన్ని చిత్రీకరించారు. తండ్రి తనను చిన్న వయసు నుంచీ ఎంతో అల్లారుముద్దుగా పెంచి, పెద్ద చేసి, విద్యాబుద్ధులు చెప్పించి, ఒక ఉద్యోగంలో చేర్చి, పెళ్లి చేస్తే.. వచ్చిన భార్య ‘నీ తండ్రి ఇంట్లో ఉంటే నేను మా పుట్టింటికి వెళ్లిపోతాన’ని చెప్పి వెళ్లిపోతుంది

దానితో తండ్రి కోసం ఆ భార్యకు విడాకులిచ్చేందుకు సిద్ధపడతాడు. ఈ విషయం తెలిసిన ఆ కొడుకు స్నేహితులు ‘తండ్రి కోసం భార్యకు విడాకులు ఇవ్వడం ఏమిటి? మీ నాన్ననే వృద్ధాశ్రమంలో చేర్చవచ్చు కదా!’ అని సలహా ఇస్తారు. ‘ఈ సలహా ఇవ్వడానికా మీరు ఇక్కడికి వచ్చింది? పొండి మీరు నా స్నేహితులే కాదు. 20 ఏళ్ల మీ స్నేహం కన్నా, నా భార్యతో ఉన్న ఏడాది బంధం కన్నా 30 ఏళ్లు పెంచిన మా నాన్నే నాకు ముఖ్యం. ‘మా నాన్నే నా మొదటి స్నేహితుడు’’ అని చెబుతాడు. ఆ కొడుకు – స్నేహితుల సంభాషణ తెలుసుకున్న కోడలుకి జ్ఞానో దయం కలిగి, పశ్చాత్తాప పడి మామ గారిని తండ్రిగా చూసుకుంటానని కాపురానికి వస్తుంది. ఆ భార్యాభర్తలు ఇద్దరూ తండ్రిని అక్కున చేర్చుకున్న కథాంశంగా తీసుకుని ఈ లఘుచిత్రాన్ని తీసినట్టు దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. ఈ మార్పు ప్రతి కొడుకు, కోడలిలో రావాలన్న మా చిరు ప్రయత్నమే ఈ లఘు చిత్రమని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement