వేతనాలు, బిల్లులు... నో..!  | Municipality Works Bills Are Pending | Sakshi
Sakshi News home page

వేతనాలు, బిల్లులు... నో..! 

Apr 21 2018 7:17 AM | Updated on Oct 16 2018 6:35 PM

Municipality Works Bills Are Pending - Sakshi

బిల్లుల చెల్లింపు జరగని బీటీ రోడ్డు, సాలూరు మున్సిపల్‌ కార్యాలయం

నెలరోజుల పాటు పనిచేస్తే చేతికి జీతం అందుతుంది. అవసరాలు తీరుతాయి. కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుందని చిరుద్యోగులు భావిస్తారు. జీతం కోసం ఆశగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లదీ ఇదే పరిస్థితి. రూ.లక్షల పెట్టుబడితో చేసిన పనులకు బిల్లులు చెలించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక ఆంక్షలు విధించిన ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు.  

సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఏప్రిల్‌ నెల పూర్తికావస్తున్నా, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వేతనాలను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించ లేదు. మున్సిపాలిటీలలో కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు సైతం బిల్లులు అందకపోవడంతో  అల్లాడుతున్నారు. మున్సిపాలిటీల్లోఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం లేకపోవడంతో  అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. దీనికి సాఫ్ట్‌వేర్‌ మార్చడమేనని అధికారులు చెబుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచిఆర్థిక ఆంక్షలు కొనసాగించడమేనని కార్మికులు, కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.

ఫిబ్రవరి నెలలోనే వేతనాల చెల్లింపు బిల్లులను మున్సిపాలిటీలలో అకౌంట్‌ అధికారులు సిద్ధం చేసినా, జాప్యం జరిగిందంటూ ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేసింది. మార్చి నెలాఖరునాటికి రాష్ట్ర ప్రభుత్వం మిగులు నిధులు చూపించేందుకే ఈ తరహా ఎత్తుగడ వేసిందని పలువురు అభిప్రాయపడుతుండగా... ఎప్పుడు బిల్లులకు క్లియరెన్స్‌ వస్తుందా..? అని ఆశతో కార్మికులు ఎదురు చూస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో రూ.11కోట్ల 10 లక్షల వేతన బకాయిలు చెల్లించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారం చేపట్టినా బడుగు జీవులకు కష్టాలు తప్పవని కార్మికులు వాపోతున్నారు.   

ఎన్నాళ్లు ఎదురు చూడాలి..?:

అభివృద్ధి పనులు చేసి బిల్లుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. జనవరి నెలలోనే పలు అభివృద్ధి పనులు పూర్తిచేశాం. మార్చి నెలలో బిల్లులు చెల్లిస్తారని భావించాం. వడ్డీకి అప్పులు చేసి పనులు జరిపించారు. నేడు ఆ అప్పులను వడ్డీలు కట్టలేక అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు వీడి, తక్షణమే బిల్లులు చెల్లించాలి.
    – యశోద కృష్ణ, మున్సిపల్‌ కాంట్రాక్టర్, సాలూరు

సాఫ్ట్‌వేర్‌ మార్చడంతో సమస్య... 

పాత విధానంలో కాకుండా కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం అమలు చేయడంతో సమస్య తలెత్తింది. కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మోనటరింగ్‌ సిస్టమ్‌ (సీఎఫ్‌ఎంఎస్‌)పై అవగాహన లేకపోవడంతో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రత్యేక శిక్షణ ఇస్తే త్వరితగతిన బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. 
    – ఎం.ఎం.నాయుడు, మున్సిపల్‌ కమిషనర్, సాలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement