మృగ్యమవుతున్న మానవత్వం

Municipal Staff Shifting Dead Body in Dumping Vehicle in East Godavari - Sakshi

ఆధ్యాత్మిక, చారిత్రక నగరంలో అమానవీయ దృశ్యం

మృతదేహాలను చెత్త బండిలో శ్మశాన వాటికకు తరలింపు

తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం సిటీ: రోడ్డు ప్రమాదాలు, ఫుట్‌పాత్‌లపై మరణించే అనాథల శవాలను రోటరీ కైలాసభూమికి తరలింపులో మున్సిపల్, పోలీసు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అనాథుల మృతదేహాలను శ్మశానవాటికకు తరలించేందుకు రోటరీ కైలాసభూమి నుంచి ఉచితంగా వాహనాలు అందించే అవకాశం ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. చెత్తను తరలించే తొట్టెలో అమానవీయంగా తరలిస్తుండడంపై నగరవాసులు మండిపడుతున్నారు. రాజమహేంద్రవరం ఇన్నీసుపేట

కైలాస భూమికి అనాథ మృతదేహాన్ని మున్సిపల్‌ సిబ్బంది పోలీసులు ఇలా చెత్త బండిలో తరలిస్తుండడంతో ఓ వ్యక్తి తీసిన ఫొటో సామాజిక మాద్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. నగరంలో మానవత్వం మంటగలిసేలా ఈ చర్యలేంటని పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీస్‌ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. అనాథ మృతదేహాల తరలింపులో సంబంధిత సిబ్బందికి రూ.వెయ్యి స్టేషన్‌ నుంచి ఇస్తామని చెబుతున్నారు.

అయితే రాజమహేంద్రవరంలోని రోటరీ కైలాసభూమి నిర్వాహకులు పట్టపగలు వెంకట్రావును సంప్రదించగా ఇన్నీసుపేట, కోటిలింగాల రేవు శ్మశానవాటికలకు సంబంధించి రెండు వాహనాలు అనాథ మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ సంఘటన జరిగిన రోజు మున్సిపాలిటీ, పోలీసుల వద్ద నుంచి ఏవిధమైన సమాచారం రాలేదని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ అనాథ మృతదేహాన్ని తీసుకుని వచ్చి కైలాసభూమిలో అప్పగించి వెళ్లిపోయారని వెంకట్రావు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top