ఈఓ గారూ.. ఏంటిదీ?

mudragada padmanabham Letter To Annavaram Temple EO - Sakshi

ఆదాయం తక్కువ వస్తుందని దేవుడిని కూడా వేలం వేస్తారా?

శుభకార్యాలు చేసుకునే వారిని ఇబ్బందులకు గురిచేసే ఆలోచన మానుకోండి

అన్నవరం దేవస్థానం ఈఓకి ముద్రగడ లేఖ

కిర్లంపూడి (జగ్గంపేట): ఆదాయం తక్కువ వస్తుందని, దేవుడిని కూడా వేలం వేస్తారా? అంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారికి లేఖ రాశారు. కిర్లంపూడి గ్రామంలో దేవస్థానం నిధులతో చుట్టు పక్కల 20 గ్రామాల ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో బాధలు, కష్టాలు పడి కల్యాణ మండపం నిర్మించుకున్నామన్నారు. పంచాయతీ ఉచితంగా ఇచ్చిన ఈ స్థలం విలువ సుమారు రూ.రెండు కోట్లు ఉంటుందన్నారు. శుభకార్యాలు చేసుకునే వారికి టెంట్లు వగైరా వాటికి వేలాది రూపాయల ఖర్చు తగ్గించడం కోసం తక్కువ అద్దెతో ఇప్పించడానికి కట్టించిన మండపం అన్నది గుర్తు చేస్తున్నానన్నారు. కమీషన్‌ కోసం కట్టించింది కాదన్నారు.

కానీ ప్రజల సుఖం కోసం కాకుండా వ్యాపార ధోరణితో మండపం దీర్ఘకాలం అద్దెకు ఇవ్వాలని నిర్ణయించి ఈనెల 12న టెండర్‌ పిలిచినట్టు తెలిసి బాధపడుతున్నానన్నారు. మీది వ్యాపార ధోరణి అయినప్పుడు ఉచితంగా ఇచ్చిన పంచాయతీ స్థలం విలువ ప్రకారం మీకు వచ్చే అద్దెలో వాటా ఇవ్వాలి కదా అన్నారు. అలా వచ్చే ఆలోచన ఉన్నప్పుడు టెండర్‌ ద్వారా వచ్చే అద్దెలో ఎవరి వాటా ఎంత అన్నది విభజన చేస్తారా? అని ప్రశ్నించారు. ఈఓ దగ్గర నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు నెలనెలా జీతాల నిమిత్తం లక్షలాది రూపాయలు ఇస్తున్నారు కదా, అలా జీతాలు లేని పద్ధతిలో ఈ ఉద్యోగాలన్నీ టెండర్‌ ద్వారా వేలం పెడితే దేవస్థానానికి ఆదాయం పెరుగుతుంది కదా అన్నారు. ఆ ఆలోచన ఎందుకు చేయరు? అని ప్రశ్నించారు. చేతిలో కలం, పేపర్‌ ఉంది కదా అని తమరికి తోచిన ఆలోచనలు వస్తే మానుకోండి అన్నారు. మండపం నిర్మాణం వెనుక ఎంతో కష్టం ఉన్న సంగతి మీకు తెలియదన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి ఏ నిర్ణయం చేయాలో మీ విజ్ఙతకు విడిచి పెడుతున్నానని లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top