కంభం చెరువు కరువుకు దర్పణం

MP YV Subba Reddy Commits On Chandrababu Naidu - Sakshi

కంభం చెరువును పరిశీలించిన అనంతరం మాట్లాడుతున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, చిత్రంలో వైఎస్సార్‌ సీపీ నేతలు ఐవీ రెడ్డి, పిడతల సాయికల్పనారెడ్డి తదితరులు

కంభం: ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు నాడి వంటిదని అటువంటి ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ఈప్రాంత ప్రజలు సాగు, తాగు నీరందక అల్లాడుతున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సస్యశామలం చేస్తామని చెప్పారు. సోమవారం కంభం చెరువు సందర్శించిన ఆయన ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన కంభం చెరువును ఎడారిని తలపించడాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వానికి కంభం చెరువు కనబడటం లేదా..? అని ప్రశ్నించారు. గత 40 ఏళ్ళల్లో కంభం చెరువు నిండింది మూడు సార్లు అంటే ఈ ప్రాంతంలో ఎంత కరువు ఉందో అర్థమవుతోందన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రకృతి సహకరించక వర్షాలు కూడా కురవడం లేదన్నారు. ఫలితంగా కంభం చెరువుపై ఆధార పడిన నాలుగు మండలాల ప్రజలు తాగు, సాగు నీరందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పైభాగంలో గుండ్లకమ్మ, జంపలేరుపై కడుతున్న కట్టడాల నుంచి వర్షాలు కురిసినప్పుడు ఎవరికీ ఇబ్బంది లేకుండా కంభం చెరువుకు రావాల్సిన నీటిని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. చెరువు 18 అడుగుల మేర పూడి పోయిందన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.12 కోట్లు జపాన్‌ నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చెరువు అభివృద్ధి జరగకుండానే నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు.

ఏడాదికి కిలో మీటర్‌ కూడా తవ్వలేదు.
అధికారంలోకి వస్తే సంవత్సరంలోగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానన్న చంద్రబాబు నాలుగేళ్ల కాలంలో కేవలం రూ.600 కోట్లు ఖర్చుపెట్టి కనీసం మూడున్నర కిలోమీటర్ల సొరంగం కూడా తవ్వలేదన్నారు. నాలుగేళ్లలో నాలుగు కిలోమీటర్ల పనులు పూర్తి చేయని చంద్రబాబు 6 నెలల్లో 3 కిలోమీటర్ల పనులు పూర్తిచేసి నీళ్లిస్తానని చెప్పడం ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేయడం కాదా..? అని ప్రశ్నించారు.

ప్రజల్లో చైతన్యం తెస్తాం..
గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండపి నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్‌ నీటివల్ల ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం కమీషన్ల కోసం టెండర్లు పిలిచే కార్యక్రమం చేస్తుందే తప్ప ప్రాజెక్టును పూర్తి చేసేలా కనబడటం లేదని విమర్శించారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని 5 నియోజకవర్గాల్లో ప్రజలను సమాయత్తం చేసి ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని అప్పటికి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేని పక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సంవత్సంలోగా పూర్తి చేసి కంభం చెరువులో 365 రోజులు నీళ్లు ఉండేలా చేసే బాధ్యత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఆయన వెంట పార్టీ గిద్దలూరు నియోజకవర్గ కన్వీనర్‌ ఐవీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి, అభిషేక్‌రెడ్డి, కంభం మండల కన్వీనర్‌ లాయర్‌ శ్రీనివాసులరెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top