వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి, పార్టీ వల్ల గెలవలేదని చెప్పడం ఎంతవరకు న్యాయం’’ అంటూ వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ కొత్తపల్లి గీతను పార్టీ నేతలు, కార్యకర్తలు నిలదీశారు.
విజయనగరం: ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి, పార్టీ వల్ల గెలవలేదని చెప్పడం ఎంతవరకు న్యాయం’’ అంటూ వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ కొత్తపల్లి గీతను పార్టీ నేతలు, కార్యకర్తలు నిలదీశారు. ఈ ఘటన అరకు లోక్‌సభ పరిధిలోని విజయనగరం జిల్లా కురుపాంలో శుక్రవారం జరిగింది. అభివృద్ధి పనులపై జరిగిన సమీక్షా సమావేశానికి గీత హాజరయ్యారు. దీనికి అధికారులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు ఎస్.పద్మావతి, ఎంపీపీ, కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగానే ఎంపీ గీత వ్యవహార శైలిపై నేతలు, కార్యకర్తలు నిలదీశారు. దీంతో గీత దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎలాంటి బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ఎంపీకి ప్రజలే తగిన సమాధానం చెబుతారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.