కొల్లేరు కట్టుబాట్లకు చెల్లుచీటి పలకండి

MP Kotagiri Sridhar Speech At Kolleru People Meeting - Sakshi

 ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ 

కైకలూరు: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటి ఓటు హక్కును కొల్లేరు గ్రామాల్లో కట్టుబాట్లు చిదిమేస్తున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏలూరు పార్లమెంటు సభ్యుడు కోటగిరి శ్రీధర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు ట్రావెలర్స్‌ బంగ్లాలో గురువారం జరిగిన కొల్లేరు గ్రామాల ఆత్మీయ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌)తో కలసి ఆయన పాల్గొన్నారు. కృష్ణాజిల్లాకు చెందిన 110 మంది కొల్లేరు గ్రామాల పెద్దలు ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో  చేరారు. మరో 15 గ్రామాల ప్రజలు పార్టీలో చేరాలని తీర్మానం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో కుల కట్టుబాట్ల కారణంగా ఒకే పార్టీకి చెందిన వ్యక్తికి ఓట్లు వేయడం మంచి పద్ధతి  కాదన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలోనైనా కొల్లేరు ప్రజలు కట్టుబాట్లు కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కొల్లేరులో రెగ్యులేటర్‌ నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని భూములు రీ సర్వే జరుగుతుందని, కొల్లేరు భూములు ఇందులో ఉంటాయని తెలిపారు. వైఎస్సార్‌ సీసీ నాయకులు ముంగర నరసింహారావు, కొండలరావు, బొడ్డు నోబుల్, వాసిపల్లి యోనా, పంజా రామారావు, కొల్లేరు పెద్దలు సైత సత్యనారాయణ, ఘంటసాల వెంకటేశ్వరరావు, నబిగారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top