
లంక గ్రామాల్లో అటవీ సిబ్బందికి ఆటంకాలు
రెచ్చిపోతున్న కూటమి నేతలు
రేంజర్‌ను బహిరంగంగా తిట్టి.. ఆనక క్షమాపణ చెప్పిన ప్రజాప్రతినిధి
సుప్రీంకోర్టు ఆదేశాలకు అడుగడుగునా అడ్డంకులు
కూటమి పాలనలో నోరెత్తలేకపోతున్న అటవీ సిబ్బంది
సాక్షి, టాస్క్ ఫోర్స్: ఓవైపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను శిరసావహిస్తూ విధుల్లో ముందడుగు వేస్తున్న అటవీ సిబ్బందికి..మరోవైపు కూటమి ప్రభుత్వ పెద్దలు అడ్డుపడుతున్నారు. ఏ చర్యా చేపట్టకూడదంటూ భీషి్మస్తున్నారు. ఈ నేపథ్యంలో కొల్లేరులో అటవీ శాఖ సిబ్బందికి విధులు కత్తిమీద సాములా పరిణమిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్రమ చెరువులకు గండ్లు పెట్టడానికి వెళ్లే అటవీ సిబ్బందిపైకి కూటమి నేతలు మహిళలను ఉసిగొల్పుతున్నారు. రాజకీయాలు, స్థానబలం ముందు అటవీ సిబ్బందికి ఏం చేయాలో ? ఎలా వ్యవహరించారో తెలియక పాలుపోని పరిస్థితి నెలకొంది.
బహిరంగంగానే బెదిరింపులు
ఏలూరు జిల్లా కొల్లేరు ప్రాంతంలో ఇటీవల బహిరంగ సభ జరిగింది. అక్రమ చెరువులకు అటవీ సిబ్బంది అడ్డుతగులుతున్నారంటూ కొల్లేరు అక్రమార్కులు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధి«కి ఫిర్యాదు చేశారు. అంతే రేంజర్ స్థాయి అధికారిపై ఆయన బహిరంగ బెదిరింపులకు దిగారు. ఆనక అధికారిని ఆఫీసుకు పిలిపించి క్షమాపణ చెప్పారు.
‘కొల్లేరులో మిమ్మల్ని కట్టేస్తే నేను రాను. ఇక మీ ఇష్టం’ అంటూ కైకలూరుకు చెందిన మరో ప్రజాప్రతినిధి అటవీ సిబ్బందిని హెచ్చరించారు. ఇదే మండలం చటాకాయి గ్రామంలో అక్రమ చెరువులను ధ్వంసం చేయడానికి వెళితే గ్రామం ప్రారంభంలోనే టెంట్లు వేసి సిబ్బందిని రానివ్వలేదు. గోకర్ణపురం, పందిరిపల్లిగూడెం వద్ద కూటమి నేతలు అటవీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇలాంటి ఘటనలు కొల్లేరు గ్రామాల్లో కోకొల్లలు.
అటు ఆంక్షలు.. ఇటు బేరసారాలు
కొల్లేరు పరిధిలో అటవీ సిబ్బంది ఆంక్షల చట్రంలో నలిగిపోతున్నారు. అక్రమ చెరువులను గండి కొట్టడానికి వెళ్లే సిబ్బందికి స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వెంటనే ఫోన్లు వస్తుంటాయి. దీంతో ఏమీ చేయలేక వెనుదిరగాల్సి వస్తోంది. ఇంకొన్ని చోట్ల ‘మీరు మాకు సహకరించండి..మేము మీకు చూసుకుంటాం’ అనే ఒప్పందంతో కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పెదపాడు, ఏలూరు, భీమడోలు, నిడమర్రు, కైకలూరు, మండవల్లి, ఆకివీడు మొత్తం ఏడు ఫారెస్టు సెక్షన్లు ఉన్నాయి.
వీటి పరిధిలో అభయారణ్యాన్ని రక్షించడానికి డీఎఫ్‌వో, రేంజర్, డీఆర్వో, సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ హెల్పర్లు, కార్యాలయాల్లో సిబ్బంది ఇలా దాదాపు 85 మంది విధులు నిర్వహిస్తున్నారు. కొల్లేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు ఔట్ సోర్సింగ్‌లో అదే గ్రామాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆయా గ్రామాల్లో వీరు విధులు నిర్వహించడం పెద్ద సాహసంగా మారింది. కూటమి నేతలు చెప్పినట్టుగా చేయకపోతే వీరికి ఉద్యోగాలుండవని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
ఆడవాళ్లతో దాడులు
కొల్లేరు ఆక్రమణలు, అక్రమ పట్టుబడుల గురించి ప్రశ్నించినా, వార్తలు రాసినా బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఈ సారి దాడుల మార్గాన్ని కొత్తగా ఎంచుకున్నారు. ఏకంగా ఆడవాళ్లను లారీల్లో తీసుకొచ్చి మరీ ఇళ్ళపై దాడి చేస్తాం అంటూ భయపెడుతున్నారు. ఈ లోగా కొల్లేరు మరమ్మతుల పేరుతో గట్ల విస్తీర్ణం పెంచుకుంటున్నారు. నేతల అండదండలతో ఆక్వా చెరువుల నుంచి ఎకరాకి ఇంతని కొల్లేరు పెద్దల ముసుగులో నాయకులు డబ్బులు వసూలు చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గతంలోనూ ఇలాంటి దాడులే
కొల్లేరులో అటవీ సిబ్బందిపై ప్రస్తుతం సాగుతోన్న బెదిరింపులు, హెచ్చరికలను చూస్తుంటే...2014–2019 మధ్య కాలంలో చోటుచేసుకున్న దాడులే స్ఫురణకు వస్తాయి. ముఖ్యంగా 2016లో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు పోలీసు, ఫారెస్టు శాఖలపై దాడులే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
ఆ దాడుల్లో కొన్నింటిని చూస్తే..
» కొల్లేటికోట జాతర సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లను చితకబాదారు.
» మండవల్లి మండలం చింతపాడు, పులపర్రు, దయ్యంపాడు గ్రామాల్లో అటవీ సిబ్బందిని అడ్డుకున్నారు. జీపును సైతం పడేశారు.
» గుమ్మళ్ళపాడులో కోడిపందేలను అడ్డుకున్న సురేశ్, గణేశ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను కొట్టారు.
» తన వాహనాన్ని పెద్దింట్లమ్మ దేవస్థానానికి అనుమతించలేదని ఓ మాజీ సర్పంచ్ కానిస్టేబుల్ చొక్కా చింపేశాడు.
» తమ మాటను లెక్క చేయలేదని వినోద్‌కుమార్, సునీల్‌కుమార్ అనే ఇద్దరు ఫారెస్టు అధికారులను బదిలీపై పంపించేశారు.
» ప్రస్తుతం ఇలాంటి ఘటనలే పునరావృతమవుతుండటంతో అటవీశాఖ, పోలీసు శాఖ సిబ్బందిలో ఏం చేయాలో? ఎలా ముందుకెళ్లాలో? తెలియని పరిస్థితి నెలకొంది.
కొల్లేరులో అక్రమంగా చేపల చెరువులను తొలగించండి. ఎందుకు వాటిని తొలగిస్తున్నారో స్థానికులకు అవగాహన కల్పించండి. అందుకు తగిన చర్యలు చేపట్టండి’ – అటవీ శాఖను ఆదేశించిన సుప్రీంకోర్టు
‘ఏం చేయమంటారండీ.. ఇటు సుప్రీంకోర్టు నుంచి అక్షింతలు. అటు రాజకీయ నేతల నుంచి బెదిరింపుల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాం. కరవమంటే కప్పకు .. విడవమంటే పాముకు కోపమన్న చందంగా మారింది మా పరిస్థితి’ –పేరు చెప్పడానికి ఇష్టపడని కొల్లేరు అభయారణ్యంలో పనిచేస్తున్న ఓ అటవీ అధికారి ఆవేదన
‘అటవీ సిబ్బంది విధులకు ఎవరైనా అడ్డువస్తే సహించేది లేదు. చట్టపరంగా చర్యలు తప్పవు’ – ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు