సాక్షి,తాడేపల్లి: మహిళపై దారుణానికి ఒడిగట్టిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ లేదు. మహిళలపై బరి తెగించి మృగాలుగా వ్యవహరిస్తున్నారు. మహిళల జీవితాలతో అడుకుంటున్నారు. తప్పు చేస్తే శిక్షిస్తారనే భయం లేకుండా పోయింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశాడు.
అతనిపై ఇంకా ఎందుకు కేసులు పెట్టలేదు?. తప్పుడు పనులు చేసే వారికే ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. రాప్తాడులో పద్నాలు మంది టీడీపీ కార్యకర్తలు లైంగిక దాడి చేస్తే కేసు లేదు. కిరణ్ రాయల్ అనే జనసేన నేత లక్ష్మి అనే మహిళ జీవితాన్ని రోడ్డున పడేశాడు. కోట వినూత మీద టీడీపీ ఎమ్మెల్యే స్పై చేస్తే చర్యలు లేవు. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస రావు వలన మహిళా వీఆర్వోపై దాడి చేసినా చర్యలు లేవు.
ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళకు ఐదుసార్లు అబార్షన్ చేయించాడు. లొంగక పోతే ఆమె కొడుకుని చంపుతానని బెదిరించాడు. పవన్ కళ్యాణ్ కనీసం ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా?. మహిళపై చేయి వేస్తే అదే చివరి రోజు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు?. మహిళా హోంమంత్రి అనితకు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కనపడటం లేదా?. మంత్రి సంధ్యారాణి పీఏ మహిళను అన్యాయం చేస్తే తిరిగి బాధితురాలి మీదే కేసు పెట్టారు
అధికారమదంతో ఉన్న ఇలాంటి వారి వల్ల మహిళలకు రక్షణ ఉంటుందా?. అసలు రాష్ట్రంలో మహళా కమిషన్ ఏం చేస్తోంది?. సుమోటోగా ఎందుకు కేసు పెట్టలేదు?.బలహీనతలు ఉంటే బయటకు రానీయవద్దని ప్రకటన చేసిన పార్టీ జనసేన. తప్పులు చేయవద్దని చెప్పకుండా వీడియోలు బయటకు రానీయవద్దన్న ఏకైక పార్టీ జనసేన’అని మండి పడ్డారు.


