సూర్య ది గ్రేట్‌

mount everest Climber Surya Prakash Special Story - Sakshi

ఎవరెస్ట్‌ అధిరోహించి రికార్డు సృష్టించిన సూర్యప్రకాష్‌

ఎవరెస్ట్‌ అధిరోహించి రికార్డు సృష్టించిన సూర్యప్రకాష్‌

మల్లి మస్తాన్‌బాబు స్ఫూర్తితో పర్వతారోహణ

నేడు స్వగ్రామం పెనుబల్లికి రాక

కలెక్టర్‌తో పాటు బుచ్చి స్పోర్ట్స్‌క్లబ్‌  ఆధ్వర్యంలో సన్మానం

బుచ్చిరెడ్డిపాళెం : మల్లి మస్తాన్‌బాబు స్ఫూర్తితో పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రెనాక్‌ పర్వతారోహణతో ముందుకు సాగాడు.  సెట్నల్‌ ఆధ్వర్యంలో మిషన్‌ ఎవరెస్ట్‌కు జిల్లా నుంచి ఎంపికయ్యాడు. ఎవరెస్ట్‌ శిఖరాన్ని  దిగ్విజయంగా అధిరోహించడం ద్వారా జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు. అతడే బుచ్చిరెడ్డిపాళెం మండల పెనుబల్లికి చెందిన కోరికల వెంకట సూర్యప్రకాష్‌. నేడు స్వగ్రామానికి వస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లికి చెందిన కోరికల శ్రీనివాసులు, ఆదిశేషమ్మ దంపతుల రెండో సంతానం కోరికల వెంకట సూర్యప్రకాష్‌. శ్రీనివాసులు కోవూరు సహకార చక్కెర కర్మాగారంలో కూలీ కాగా, ఆదిశేషమ్మ అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. కృష్ణచైతన్య కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతున్న సూర్యప్రకాష్‌ చిన్నపట్నుంచి ఆటల్లో ముందుండేవాడు. కబడ్డీ, క్రికెట్‌లో జిల్లాస్థాయిల్లో సత్తా చాటాడు.

మల్లి మస్తాన్‌బాబు స్ఫూర్తితో..
సంగం మండలం గాంధీజనసంఘం గ్రామానికి చెందిన దివంగత పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు స్ఫూర్తితో సూర్యప్రకాష్‌ పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. మల్లి మస్తాన్‌బాబులా దేశానికి మంచి పేరు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మల్లి మస్తాన్‌బాబు మృతితో కలత చెందిన సూర్యప్రకాష్‌ ఎలాగైనా పర్వతారోహణ చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా పట్టుదల వదలకుండా  నరసింహకొండపై 2015లో తరచూ ట్రెక్కింగ్, రాక్‌ క్‌లైంబింగ్‌ చేసేవాడు. జిల్లా యువజనుల శాఖ ఆధ్వర్యంలో  2016లో మిషన్‌ ఎవరెస్ట్‌కు ఎంపికయ్యాడు. అయితే తల్లిదండ్రులు వద్దనడంతో వచ్చేశాడు. అంతటితో ఆగక విజయవాడలోని సీబీఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో ట్రెక్కింగ్, రాక్‌ క్‌లైంబింగ్‌లో శిక్షణ పొందాడు. 2017లో నిమాస్‌లో బేసిక్‌ మౌంట్‌నీరింగ్‌ నేర్చుకున్నాడు. 2017 సెట్నల్‌ ఆధ్వర్యంలో మిషన్‌ ఎవరెస్ట్‌కు ఎంపికయ్యాడు. 

నేడు స్వగ్రామానికి రాక
ఎవరెస్ట్‌ పర్వతారోహణ చేసిన సూర్యప్రకాష్‌ విజయవాడలోని శిక్షణ కేంద్రం నుంచి బయల్దేరి మంగళవారం ఉదయం నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరులో సూర్యప్రకాష్‌ను కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు సన్మానించనున్నారు. అనంతరం బుచ్చిరెడ్డిపాళేనికి బయల్దేరి వస్తారు.  బుచ్చిస్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద విద్యార్థుల సాదర స్వాగతం పలకనున్నారు. అనంతరం ర్యాలీగా డీఎల్‌ఎన్‌ఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటాడు.

అధిరోహించిన పర్వతాలు
2017  మార్చి–ఏప్రిల్‌లో ఇండియా–చైనా బోర్డర్‌లోని మేరాతాంగ్‌ పర్వతాన్ని అధిరోహించాడు.
2017 ఆగస్టు 15న ఆఫ్రికా ఖండంలోని అతి పెద్దదైన కిలీమంజారో పర్వతాన్ని 5,895 మీటర్ల ఎత్తు ఎక్కి తన సత్తా చాటాడు.
2017 డిసెంబర్‌లో సిక్కిం హిమాలయాల్లోని రెనాక్‌ పర్వతారోహణ చేశాడు.
2018 జనవరిలో కాశ్మీర్‌ పెహల్లాం వద్ద ఉన్న తులియాన్‌ పర్వతాన్ని, ఫిబ్రవరిలో లడక్‌ ప్రాంతంలోని ఆర్‌ఆర్‌ పర్వతాన్ని అధిరోహించాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top