
మొట్టమొదటి భారతీయ అంధురాలు
హిమాచల్ ప్రదేశ్ గిరిజన మహిళ ఘనత
సిమ్లా: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే సంకల్పాన్ని సాకారం చేసుకునేందుకు అంధత్వ సైతం అడ్డంకి కాదని నిరూపించిందీ ధీర. హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూల పల్లెకు చెందిన గిరిజన మహిళ ఛోంజిన్ అంగ్మో త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంపై రెపరెపలాడించారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా, ప్రపంచంలోనే ఐదో వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు.
హెలెన్ కెల్లర్‌నే ఆదర్శంగా తీసుకున్న అంగ్మో..చూపున్నా దార్శనికత లేకపోవడం అంధత్వం కంటే ఘోరమైన విషయమని చెబుతున్నారు..! ఇండో–టిబెటన్ సరిహద్దులకు సమీపంలోని మారుమూల చంగో గ్రామంలో జని్మంచిన అంగ్మో ఎనిమిదేళ్ల వయస్సప్పుడు చూపు పూర్తిగా కోల్పోయారు. అయినప్పటికీ చదువు ఆపలేదు. పట్టుదలతో ఢిల్లీ వర్సిటీ పరిధిలోని మిరాండా హౌస్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఢిల్లీలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కస్టమర్ సరీ్వస్ అసోసియేట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గర్వించిన పుట్టిన ఊరు
అంగ్మో తండ్రి అమర్ చంద్ ఏమంటున్నారంటే..‘నా కుమార్తె సాధించిన ఘనతను చూసి నాకు ఆనందంగాను, గర్వంగాను ఉంది. ఎవరెస్ట్‌పై విజయం సాధించిన ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నా’అని తెలిపారు. అంగ్మో సాధించిన రికార్డుతో ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుంచే అంగ్మో ఎంతో ధైర్యవంతురాలు, పట్టుదల కలిగిన వ్యక్తి అని బంధువు యమ్చిన్ తెలిపారు.
జీవితంలో ఎన్ని ఎదురుపోట్లు ఎదురైనా వెరువక ప్రతి సవాల్‌ను ఒక అవకాశంగా మల్చుకున్నారు అంగ్మో. ‘నా కథ ఇప్పుడే మొదలైంది. అంధత్వం నా బలహీనత కాదు, బలం’అని చెప్పారు. ‘ఎత్తయిన శిఖరాలను అధిరోహించడం నా చిన్ననాటి కల. ఈ విషయంలో ఆర్థికపరమైన అవరోధాలను అధిగమించాను. మిగతా శిఖరాలను సైతం అధిరోహించాలని ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నాను’అని వివరించారు.
కల సాకారమైందిలా..
చిన్ననాటి కలను సాకారం చేసుకునేందుకు 2016లో బేసిక్ మౌంటెయినీరింగ్ కోర్సు పూర్తి చేసి, ఉత్తమ ట్రెయినీగా నిలిచారు అంగ్మో. 2018లో ఈమె 5,486 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తయిన మనాలి– ఖర్దుంగ్ లా రోడ్డులో అతిశీతల పరిస్థితుల్లో పది రోజులపాటు సైక్లింగ్ చేశారు. 2019లో ఆరు రోజులపాటు మూడు రాష్ట్రాల్లోని నీలగిరి కొండల్లో సైక్లింగ్ చేశారు. గతేడాది జూలైలో మనాలి నుంచి కాల్పా వరకు ఏడు రోజులపాటు సైక్లింగ్ సాగించారు.
2021లో సియాచిన్ గ్లేసియర్‌ను చేరుకున్న దివ్యాంగుల బృందంలో ఏకైక అంధురాలుగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. సుమారు 5,634 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకు అధిరోహించిన మొట్టమొదటి అంధురాలైన భారతీయ మహిళగా అంగ్మో 2024 అక్టోబర్‌లో రికార్డు సాధించారు. అనంతరం, లద్దాఖ్‌లోని 6,250 మీటర్ల ఎత్తయిన కాంగ్ యాట్సే2 శిఖరాన్ని ఎక్కారు.
దివ్యాంగ్ అధిరోహణ బృందంలో సభ్యురాలిగా 6 వేల మీటర్ల ఎత్తయిన మరో శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగరేశారు. ఆటల్లోనూ ప్రావీణ్యం చూపే అంగ్మో స్విమ్మింగ్‌లో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం, జుడోలో జాతీయ స్థాయి చాంపియన్ షిప్, జాతీయ మారథాన్‌లలో రెండు రజత పతకాలు సాధించారు. జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో సైతం పాల్గొన్నారు. అంగ్మో సాధించిన విజయాలను ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’లో కూడా ప్రస్తావించడం విశేషం. గతేడాది రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా సర్వశ్రేష్ఠ దివ్యాంగ్‌జన్ జాతీయ అవార్డును అందుకున్నారు.