మా పాలిట దేవుళ్లు మీరే.. మా అమ్మను బతికించండి

Mother Suffering With Heart Disease Children Waiting For helping Hands - Sakshi

గుండెలో మూడు చిల్లులు మంచాన పడ్డ తల్లి

ఆపన్నహస్తం కోసం చిన్నారుల ఎదురుచూపు

ఇంటిదీపం కొడిగడుతోంది నవ్వుల దివ్వె..మసకబారుతోంది అమ్మ..శ్వాస తీసుకోలేక.. ఆయాసపడుతోంది పరుగు తీసి పాలబువ్వపెట్టిన తల్లి మాయమైన నవ్వులతో..మంచానికే పరిమితమైందిఅమ్మకేమైంది....?అదేదో ప్రాణం తీసే జబ్బంటలక్షలాది రూపాయల డబ్బుండాలంటచిల్లిగవ్వలేని నిరుపేదలందయగల అయ్యలూ..ఆదుకోండి..మా అమ్మ దూరం కాకుండా చూడండి..అంటూ రెండు పసిమొగ్గలు అర్థిస్తున్నాయిఆపన్న హస్తం కోసం ఆశగాఎదురుచూస్తున్నాయి.

అనంతపురం: ఓడీ చెరువు మండలం మామిళ్లకుంట్లపల్లి హరిజన వాడకు చెందిన నాగేళ్ల నరేష్, శోభారాణి (28) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు.  గ్రామంలోని పాఠశాలలో కార్తీక్‌ 1వ తరగతి, అభిలాష్‌ యూకేజీ చదువుతున్నారు. గ్రామంలో ఓ ఇల్లు తప్ప మరే జీవనాధరం లేదు.  కేవలం కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. 

పిల్లల భవిష్యత్తు కోసం వలస పోయి..  
పిల్లలను అల్లారుముద్దగా పెంచుకుంటున్ననరేష్, శోభారాణి దంపతులు.. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు గన్నారు. తమలాగా వారూ కూలీలుగా మారకూడదని భావించారు. మనసుకు కష్టమైన తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలను నరేష్‌ తన తల్లిదండ్రుల వద్ద విడిచి.. భార్యను పిలుచుకుని పనుల కోసం బెంగుళూరుకు వలస పోయాడు. అక్కడే పనులు చేసుకుంటూ నాలుగు డబ్బులు పోగు చేసుకున్నారు. 

ఊహించని పరిణామం..  
నాలుగు నెలల క్రితం పని ప్రాంతంలో ఆయాస పడుతూ శోభారాణి కుప్పకూలిపోయారు. ఊపిరి కూడా పీల్చుకోలేక ఇబ్బంది పడుతున్న ఆమెను నరేష్‌ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కొన్ని రోజుల పాటు బెంగుళూరులోని ఆస్పత్రిలోనే ఉంటూ ఆమె ఆరోగ్యం మెరుగు పడిన తర్వాత మామిళ్లకుంట్లపల్లికి వచ్చారు. అయినా ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు. తరచూ ఆయాసపడుతూ ఇబ్బంది పడసాగారు.  

ఆస్పత్రుల చుట్టూ తిరిగి..  
భార్య శోభారాణికి చికిత్స చేయించేందుకు నరేష్‌ చాలా తపన పడ్డాడు. కదిరి, అనంతపురం, బెంగుళూలు తదతర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చూపించాడు. అప్పటి వరకూ రెక్కల కష్టంతో సంపాదించి కూడబెట్టిన సొమ్ము కాస్త ఖర్చు అయిపోయింది. సమీప బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు చేసి భార్యకు చికిత్స చేయించసాగాడు. ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు కానీ.. సుమారు రూ. 4 లక్షల వరకు డబ్బు ఖర్చు అయిపోయింది.   

ఆదుకోవాలంటూ వేడుకోలు
ఆయాసంతో శ్వాస పీల్చుకోలేక శోభరాణి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. కాళ్లు వాపు వచ్చాయి. లేవలేని స్థితిలో కటిక నేలపై పడి ఉన్న తల్లిని చూసి చిన్నారులు కార్తీక్, అభిలాష్‌ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ తల్లికి ఏమైందోనన్న ఆందోళన ఆ చిన్నారులను మరింత వేదనకు గురి చేస్తోంది. బిడ్డలు కంట తడి పెడుతుండడంతో తల్లిదండ్రులకు సైతం కన్నీరు ఆగడం లేదు. ‘అమ్మా.. ఏమైందమ్మా.. లే అమ్మ బువ్వ తిందువు’ అంటూ తమ తల్లి కడుపు నింపేందుకు చిన్నారులు పడే తపన చూసిన వారికి కళ్లు చెమరుస్తున్నాయి. ప్లేటులో అన్నం, పప్పు కలుపుకుని వచ్చి తల్లికి తినిపిస్తుంటారు. బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం ఆడుకునేందుకు సైతం బయటకు వెళ్లకుండా తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. తమ తల్లికి వచ్చిన ప్రాణాంతక జబ్బు గురించి ఏ మాత్రం అవగాహన లేకపోయినా.. ఒకటి మాత్రం వారికి అర్థమైపోయింది. మాయదారి జబ్బు నుంచి తమ తల్లిని కాపాడాలని, ఆమెను బతికించాలంటూ దేవుళ్లను వేడుకుంటున్నారు. ఆపన్నహస్తమందించే సహృదయం కోసం వేయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  

గుండెలో చిల్లులు
నెల క్రితం అనంతపురంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం కింద శోభారాణిని చేర్పించారు. నెలరోజుల పాటు అక్కడి వైద్యులు చికిత్సలు అందజేశారు. చివరకు ఆమె గుండెలో మూడు చోట్ల రంద్రాలు ఉన్నాయని, ఆపరేషన్‌ ద్వారా వాటిని సరిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా ఇప్పటి వరకు చేసిన వైద్యానికి ఖర్చులు సరిపోయాయని, ఇకపై డబ్బు ఉంటే తప్ప తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. పైగా హైదరాబాద్‌ లేదా గుంటూరులోని ఆస్పత్రుల్లో ఆపరేషన్‌ చేయించాలంటూ ఓ ఉచిత సలహా ఇచ్చి పంపించేశారు. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో గుండె దిటువు చేసుకుని వారం రోజుల క్రితం భార్యను నరేష్‌ ఇంటికి పిలుచుకువచ్చాడు.   

తల్లిదండ్రులపై ఆధారపడ్డా..   
కూడబెట్టిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టి వైద్యం చేయించా. ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద నెల రోజులు అనంతపురంలో చికిత్స చేయించా. రూ. లక్ష వరకు వైద్య ఖర్చులు అక్కడి డాక్టర్లు చూపించారు. ఇకపై డబ్బు ఇస్తే చికిత్స చేస్తామన్నారు. నా దగ్గర అంత డబ్బులేక పోవడంతో నా భార్యను పిలుచుకుని వచ్చేశా. నా భార్య దగ్గరే ఉండాల్సి వస్తోంది. ముసలాళ్లు అయిన మా అమ్మ, నాన్న కూలీ పనులకెళ్లి సంపాదించుకుని వస్తే పూట గడుస్తోంది. నా భార్య ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చే దాతల కోసం ఎదురు చూస్తున్నా.          – నరేష్, శోభారాణి భర్త

క్రిటికల్‌ కండీషన్‌ అన్నారు..  
వైద్యులు ఇచ్చిన డిశ్చార్జ్‌ రిపోర్టు చూస్తే గుండెకు సంబంధించిన జబ్బుతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె పరిస్థితి క్రిటికల్‌ కండీషన్‌లో ఉన్నట్లు అందులో రాశారు.  
– అంజి, వైద్యమిత్ర, ఓడీ చెరువు

కూలి పనులే జీవనాధారం   
శోభారాణి, నరేష్‌లకు అర ఎకరం పొలం కూడా లేదు. కూలి పనులతో కాలం నెట్టుకొస్తున్నారు. నాలుగు నెలలుగా వారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం ఖర్చులకు డబ్బులేక పోవడంతో ఇంటివద్దే ఉండిపోయారు. దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. – ఎద్దుల ఇందిరమ్మ. వైస్‌ ఎంపీపీ, మామిళ్లకుంట్లపల్లి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top