మాతా మన్నించు!

Mother And Child Deaths in kurnool - Sakshi

జిల్లాలో పెరుగుతున్న మాతృమరణాలు

క్షేత్రస్థాయిలో అందని వైద్యసేవలు

పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో వైద్యులు కరువు

గర్భిణిల్లో అధికమవుతున్న రక్తహీనత

సగం మందికి హెచ్‌బీ 8లోపే..

జిల్లాలో ప్రసవ సమయంలో మాతృ మరణాలు తగ్గడం లేదు. వైద్యులు, సిబ్బందితో పాటు పర్యవేక్షణాధికారుల కొరత, వసతుల లేమి, కొన్ని చోట్ల వైద్యుల నిర్లక్ష్యంతో ఈ మరణాల శాతం పెరుగుతోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణిలకు వైద్యపరీక్షలు మృగ్యమయ్యాయి. వారిని పట్టించుకునే దిక్కులేదు. ఆదోని డివిజన్‌లో చాలా చోట్ల ఇప్పటికీ ఇంటి వద్దే ప్రసవాలు జరుగుతున్నా స్థానిక వైద్యాధికారులు ఆ విషయాన్ని కప్పి పుచ్చుతున్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 20 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 20 అర్బన్‌హెల్త్‌ సెంటర్లు(ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు), ఒక జిల్లా ఆసుపత్రి (నంద్యాల), ఎమ్మిగనూరు, ఆదోనిలలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. వీటితో పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 4 నుంచి 10 ప్రసవాలు జరుగుతుండగా, సీహెచ్‌సీల్లో 10 నుంచి 20లోపు, ఏరియా ఆసుపత్రుల్లో 30 నుంచి 60 ప్రసవాలు నిర్వహిస్తున్నారు. అధికంగా నంద్యాల, ఆదోని ఆసుపత్రుల్లో నెలకు 150 నుంచి 250 వరకు ప్రసవాలు జరుగుతుండగా ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ప్రతి నెలా వెయ్యికి పైగా ప్రసవాలు జరుగుతుండటం గమనార్హం. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో గర్భిణికి ఏ మాత్రం చిన్న సమస్య వచ్చినా వెంటనే కర్నూలుకు రెఫర్‌ చేస్తున్నారు. వీటికి తోడు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏదైనా సమస్య వస్తే పెద్దాసుపత్రికే రెఫర్‌ చేస్తున్నారు. చివరి సమయంలో చికిత్సకు వస్తుండటంతో ఇక్కడి వైద్యులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఫలితంగా ఈ ఆసుపత్రిలో మాతృమరణాల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. గత జనవరి నుంచి ఇప్పటి వరకు 12 మంది మరణించినట్లు సమాచారం. గత నెలరోజుల వ్యవధిలోనే నలుగురు గర్భిణిలు ప్రసవ సమయంలో మరణించినట్లు తెలిసింది.  

పెద్దాసుపత్రిలోనూ సమస్యలు అధికం
పెద్దాసుపత్రిలోని గైనకాలజీ విభాగంలో ఏడు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల చొప్పున 42 మంది వైద్యులు ఉండాలి. ఇందులో మూడు ప్రొఫెసర్‌ పోస్టులు, మూడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో ముగ్గురు వైద్యులు ఇక్కడకు రాకుండానే సెలవు పెట్టి వెళ్లిపోయారు. కొత్తగా మంజూరైన మూడు యూనిట్లకు నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని, నాల్గవ తరగతి సిబ్బందిని నియమించలేదు. ఈ మేరకు పడకల సంఖ్యను, బడ్జెట్‌ను, మందులు, సర్జికల్‌ను పెంచలేదు. ఈ విభాగంలో అధికారికంగా 210 పడకలు ఉండగా, అనధికారికంగా రోగుల రద్దీ దృష్ట్యా మరో 150 పడకలు అదనంగా ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ 30 నుంచి 35 ప్రసవాలు జరుగుతున్నా వారికి అవసరమైన మందులు అందుబాటులో లేవు. ప్రస్తుతం డెలివరి కిట్స్‌ సైతం గర్భిణిల కుటుంబీకులే   కొని తెచ్చుకోవాల్సి వస్తోంది. గైనిక్‌ విభాగంలో గర్భిణికి ఏదైనా సీరియస్‌గా మారితే అరకిలోమీటర్‌ దూరంలో ఉన్న క్యాజువాలిటీకి తీసుకెళ్లాల్సి వస్తోంది. అలాగాకుండా గైనిక్‌ విభాగంలోనే అవసరమైన వైద్యులు, సిబ్బందితో ఐసీయూ ఏర్పాటు చేయాలని వైద్యులు కోరుతున్నారు.  

గర్భిణిల్లో సగం మందికి రక్తహీనత
పెద్దాసుపత్రికి వస్తున్న గర్భిణిల్లో సగం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రసవ సమయంలోనూ అధిక శాతం మందికి హెచ్‌బీ శాతం 8లోపే ఉంటోంది.   క్షేత్రస్తాయిలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, అవసరమైన పరీక్షలు చేయకపోవడం, ఇంటింటికి తిరిగి గర్భిణిల యోగక్షేమాలు చూడాల్సిన ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు  తప్పుడు లెక్కలు చూపడం వంటి కారణాలతో వాస్తవాలు  బయటకు రావడం లేదు.  అధికారులు మాత్రం జిల్లాలో మాతాశిశుమరణాలు గణనీయంగా తగ్గించినట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపించి కితాబులు తీసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

మాతృ మరణాలకు కొన్ని కారణాలు
కర్నూలుతో పాటు ఆదోని, నంద్యాల ఆసుపత్రుల్లో వైద్యులు, పారామెడికల్, స్టాఫ్‌నర్సుల కొరత తీవ్రంగా ఉంది. దీనికితోడు వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, విధులకు డుమ్మా కొట్టడం పరిపాటిగా మారింది. అధిక శాతం రౌండ్‌ ది క్లాక్‌ పీహెచ్‌సీల్లో రాత్రి వేళల్లో వైద్యులు, స్టాఫ్‌నర్సులు సైతం ఉండటం లేదు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లాంటి చోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాత పీజీలు, హౌస్‌సర్జన్లే పెద్దదిక్కుగా మారుతున్నారు. డ్యూటీలో ఉండే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు చాలా మంది సీరియస్‌ కేసు ఉంటే ఫోన్‌కాల్‌తో మాత్రమే విధులకు వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.  గర్భిణìలు రెగ్యులర్‌గా చెకప్‌ చేయించుకోకపోవడం, వైద్యుల సూచనలు పాటించకపోవడం, పోషకాహారలోపం వంటి కారణాలు మాతా మరణాలు పెరగడానికి కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.  

 ఎమ్మిగనూరు మండలం కనకవీడు గ్రామానికి చెందిన మిథియాకు ముగితి గ్రామానికి చెందిన అనోక్‌లకు ఏడాది క్రితం వివాహమైంది. మిథియా గర్భం దాల్చి గురువారం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా అక్కడి వైద్యులు సిజేరియన్‌ ఆపరేషన్‌ ద్వారా ప్రసవం చేశారు. అయితే, అదే రోజు సాయంత్రం ఆమెకు ఆయాసం అధికం కావడం, బ్లడ్‌ ప్రెషర్‌లో సమస్యలు రావడంతో వెంటనే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. శుక్రవారం ఆమె చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించింది. సిజేరియన్‌ ఆపరేషన్‌ సమయానికి ఆమె హెచ్‌బీ శాతం 8గా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆమెను క్షేత్రస్థాయిలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆశాలు ఎందుకు పట్టించుకోలేకపోయారో ఉన్నతాధికారులే చెప్పాలి.  లేకపోతే ఎప్పటిలాగానే సాకులు చెబుతారో చూడాలి మరి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top