శిశు సురక్ష..వినియోగంలో వివక్ష | Mother And Child Deaths in Kurnool | Sakshi
Sakshi News home page

శిశు సురక్ష..వినియోగంలో వివక్ష

Feb 11 2019 1:55 PM | Updated on Feb 11 2019 1:55 PM

Mother And Child Deaths in Kurnool - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): మాతాశిశు మరణాలు తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. వాటి ద్వారా నిధులు కూడా భారీగానే ఇస్తోంది. అయితే..క్షేత్రస్థాయిలో నిధుల వినియోగంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్‌ఎస్‌కే) కింద ప్రభుత్వాసుపత్రులకు విడుదల చేసిన నిధులను ఏమాత్రమూ ఖర్చు చేయడం లేదు. ఇవి మూలుగుతున్నా అధికారులు పట్టించుకోకుండా..ప్రసవాలకు వస్తున్న వారితోనే చేతి నుంచి ఖర్చు చేయిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉండేందుకు జననీ శిశు సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీని కింద ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే వరకు  ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టించకుండా చికిత్స అందించాలి. ఆసుపత్రికి రాను, పోను చార్జీలతో పాటు చికిత్సకు అవసరమయ్యే మందులు, వైద్యపరీక్షలు, రక్తనిధుల నుంచి తెచ్చే రక్తానికి సైతం జేఎస్‌ఎస్‌కే నిధులను ఖర్చు చేయాలి. ఈ మేరకు జిల్లాలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రితో  పాటు నంద్యాలలోని జిల్లా ఆసుపత్రి, ఆదోనిలోని మాతాశిశు కేంద్రం, 18 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోంది. జిల్లాలో అన్ని ఆసుపత్రులకు కలిపి రూ.1.50 కోట్లు విడుదల చేస్తోంది.  కానీ ఈ నిధులను జిల్లాలోని అధిక శాతం ఆసుపత్రులు ఖర్చు చేయడం లేదు. ఇలాంటి నిధులు ఉన్నాయని కొంత మంది వైద్యాధికారులకు కూడా అవగాహన లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నంద్యాల జిల్లా ఆసుపత్రితో పాటు ఆదోని ఏరియా ఆసుపత్రి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం ఈ పథకం పూర్తిగా అమలు కావడం లేదు. 

ప్రసవానికి రూ.5 వేల దాకా ఖర్చు
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ప్రసవాలు చేస్తామని అధికారులు ఊదరగొడుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటోంది. జిల్లాలోని 70 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు ఒకటి నుంచి ఐదులోపే ప్రసవాలు జరుగుతున్నాయి. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలోనూ గైనకాలజిస్టులు, పీడియాట్రిస్ట్‌లు లేకపోవడంతో సిజేరియన్‌ అవసరమైతే నంద్యాల, కర్నూలు, ఆదోనిలకు రెఫర్‌ చేస్తున్నారు. ఫలితంగా అత్యధిక ప్రసవాలు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఆ తర్వాత నంద్యాల, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే జరుగుతున్నాయి.  ప్రతి గర్భిణి ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లడానికి 108, ఆ తర్వాత ఆసుపత్రిలో ఉచితంగా ప్రసవం, ఇంటికి వెళ్లేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహన సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆసుపత్రిలో ప్రసవాలు మాత్రం ఉచితంగా జరగడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమై డిశ్చార్జ్‌ అయ్యే సమయానికి ఒక్కొక్కరు మందులు, రక్తం, వ్యాధినిర్ధారణ పరీక్షల పేరిట రూ.3 వేల నుంచి రూ.5వేల దాకా ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది.  ప్రసవాలకు అవసరమైన మందులు, వైద్యపరీక్షలు అన్నీ ఆసుపత్రిలోనే ఉచితంగా నిర్వహించాల్సి ఉన్నా.. అత్యవసరం పేరుతో బయటకు పంపి ఖర్చు చేయిస్తున్నారు. ఇలా ఖర్చు చేసిన మొత్తాన్ని రోగులకు వెనక్కివ్వడం లేదు. 

ఇప్పుడు వైద్యసేవ పేరుతో..
జననీ శిశు సురక్ష కార్యక్రమం అమలులో పూర్తిగా చేతులెత్తేసిన అధికారులు, వైద్యులు ఇప్పుడు ఎన్‌టీఆర్‌ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) ద్వారా ఈ నెల ఒకటో తేదీ నుంచి ఉచితంగా ప్రసవాలు చేస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నారు. ఇప్పటికే పలు వ్యా«ధులకు ఆసుపత్రిలో ఈ పథకం అమలులో ఉన్నా.. ప్రతి రోగి డిశ్చార్జ్‌ అయ్యే సమయానికి రూ.5వేల నుంచి రూ.20వేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఇలా ఖర్చు పెట్టిన మొత్తంలో 10 శాతం మాత్రమే వెనక్కి ఇస్తున్నారు. అయితే.. పథకం ద్వారా వచ్చే ప్రోత్సాహక నగదును మాత్రం అధికారులు, వైద్యులు, ఉద్యోగులు లెక్క తప్పకుండా పంచుకుంటున్నారు.  ప్రసవాలకు సైతం ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ఇదే రీతిన కొనసాగే అవకాశం ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ప్రసవాలకు వచ్చిన వారికి ఉచితంగా వైద్యం అందించాలని గర్భిణులు, వారి కుటుంబీకులు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement