ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమలు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా జిల్లాకో ఐఏఎస్‌ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమలు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా జిల్లాకో ఐఏఎస్‌ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక అధికారులు చేయాల్సిన పనులను ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రతి నెల ఒకసారి వీరంతా ఆయా జిల్లాల్లో పర్యటించాల్సి ఉంటుంది. జిల్లా అధికారులతో సమావేశమై పథకాలు, కార్యక్రమాల అమలు తీరు ఎలా ఉందో మండల, గ్రామస్థాయివరకు సమీక్షించాలి.
లక్ష్యంమేరకు పథకాలను, కార్యక్రమాలను జిల్లా అధికారులు అమలు చేస్తున్నారా లేదా అనే విషయంపై ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఆన్‌లైన్‌లో పంపించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి పథకాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాల అమలుతీరు ఏవిధంగా ఉందో పరిశీలించి ప్రతి నెలా సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులకు నివేదికలను పంపించాలి. ఆ నివేదికల ప్రతులను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరును సమీక్షించడానికి ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జి మంత్రులున్నారు. పథకాల అమలును పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాకు రెండో జాయింట్ కలెక్టర్‌ను కూడా నియమించారు. తాజాగా ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.