అమరావతిలో మహిళలకు రక్షణ కరువు!

Molestation Cases Increased In Andhra Pradesh Says Survey - Sakshi

సింగపూర్‌ తరహా పాలన అంటే ఇదేనా?

మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులు

వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న రాజధాని వాసులు

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేస్తాం.. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారికి అదే ఆఖరి రోజవుతుంది.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి మహిళలపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షిస్తాం.. గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై లైంగిక దాడి జరిగిన సమయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఇవి.. అయితే ఆ తరువాత జిల్లాలో వరుసగా 20 ఘటనలు జరిగాయి. ఇంతవరకూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసిన దాఖలాలు గానీ, మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకున్న సందర్భం గానీ లేదు. జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి అతి చేరువలో ఉండే మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతులపై లైంగిక దాడులకు పాల్పడి, హత్య చేస్తున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

ఏడాది వ్యవధిలో రాజధాని ప్రాంతంలో నాలుగు వరుస ఘటనలు జరిగాయి. ప్రేమికులు నిర్మానుష్య ప్రాంతాల్లో కనిపిస్తే చాలు దాడులకు తెగబడడం, ప్రియుడిని బెదిరించో, లేక దాడి చేసో ప్రియురాలిపై లైంగిక దాడులకు యత్నించిన ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా మంగళగిరి మండలం నవులూరు వద్ద ప్రేమ జంటపై గుర్తుతెలియని వ్యక్తులు యువతిని హత్యచేసి, యువకుడిని తీవ్రంగా గాయపరిచిన ఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటనతో రాజధాని ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రేమజంటలపై దాడులు, యువతులపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నా వీటిలో కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యమంత్రి నివాసం పరిసర ప్రాంతాల్లోనే ఆందోళనకర ఘటనలు జరుగుతుండటం దారుణమని వారు వాపోతున్నారు. చంద్రబాబు రోజూ చెపుతున్న సింగపూర్‌ తరహా రాజధాని ఇదేనా.. అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఏడాదిలో ఎన్నో ఘటనలు...
1. గత ఏడాది సీతానగరం రైల్వే బ్రిడ్జిపై ప్రేమికులను బెదిరించి ప్రియుడిపై దాడిచేసి కొట్టడంతోపాటు యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించారు. అదే సమయంలో అటుగా కొందరు వస్తున్న విషయం గమనించి పరారయ్యారు. పరువు పోతుందనే భయంతో ప్రేమ జంట పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 
2. 2018, ఆగస్టులో చినకాకాని రాజ్‌కమల్‌ రోడ్డులో ఓ కానిస్టేబుల్‌ ఓ యువతితో ఉండగా, నలుగురు యువకులు వారిపై దాడిచేసి బంగారం లాక్కోవడమే కాకుండా యువతిని ముళ్ళపొదల్లోకి లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్‌ చుట్టుపక్కల వారిని పిలవడంతో వారు పరారయ్యారు. 
3. నాలుగు నెలల క్రితం మంగళగిరి మండలం పెదవడ్లపూడి సమీపంలోని కోకాకోలా ఫ్యాక్టరీ వద్ద నిర్జన ప్రదేశంలో ఉన్న ప్రేమ జంటపై దాడిచేసి ముగ్గురు యువకులు ప్రియుడిని కొట్టి పంపించారు. యువతిపై రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. 

తాజాగా  నవులూరు సమీపంలో ప్రేమ జంటపై దాడి కలకలం సృష్టించింది.  రాజధాని ప్రాంతంలో జరుగుతున్న వరుస ఘటనలు ఆ ప్రాంతవాసులను ముఖ్యంగా యువతుల తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పలు యూనివర్సిటీలు, కళాశాలలు ఉండటంతో యువతీ యువకులు ప్రేమ పేరుతో నిర్జన ప్రాంతాల్లో తిరుగుతుండటం పరిపాటిగా మారింది. ప్రేమ జంటలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన రాజధాని ప్రాంత ప్రజల్లో నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంతో పాటు, డీజీపీ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం మహిళలకు ఇచ్చే రక్షణ ఇదేనా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు కఠినంగా వ్యవహరిస్తే నేరాలకు పాల్పడేవారికి భయం కలుగుతుందని, పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కొన్ని కేసులను నీరుగారుస్తుండటం మృగాళ్లకు చట్టం అంటే భయం లేకుండా ఉందని చెబుతున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top