సాహసం.. సేవాపథం

MLA Tellam Balaraju Dstribute Goods to Tribals in West Godavari - Sakshi

దట్టమైన అడవిలో ఎమ్మెల్యే, అధికారుల పర్యటన

గిరిపుత్రుల ఆకలి తీర్చడం కోసం కాలినడకన..

కొండలు, గుట్టలు, వాగులు దాటుతూ ప్రయాణం  

నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించిన వైనం

పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ అడవిబిడ్డల ఆకలితీర్చేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలను సమాయత్తం చేసి కొండలు, వాగులు, వంకలు దాటుతూ మారుమూల గిరిజన గ్రామాలకు చేరుకుని నిత్యావసర సరుకులు, కూరగాయలు అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 56 గిరిజన గ్రామాల్లో పర్యటించి సుమారు రూ.75 లక్షల విలువైన నిత్యావసరాలు అందించారు. తాజాగా బుధవారం మరో సాహసోపేతమైన పర్యటన చేశారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న బుట్టాయగూడెం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మోతుగూడెం గ్రామాన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి ఆర్‌వీ సూర్యనారాయణతో కలిసి సందర్శించారు. యాక్షన్‌ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన నిత్యావసర సరుకులు, కూరగాయలను 150 గిరిజన కుటుంబాలకు అందించారు. 

ద్విచక్రవాహనంపై వాగు దాటుతున్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, అధికారులు
ఐదు కిలోమీటర్ల మేర కాలినడకన..
మోతుగూడెం పర్యటన సాహసంతో కూడుకున్నది. ఎత్తయిన కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సరైన రహదారి లేని ఈ గ్రామానికి వెళ్లాలంటే సుమారు ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే. దశాబ్దాలుగా ఈ గ్రామ గిరిజనులకు కాలిబాటే ఆధారం. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో కొంతమేర రహదారుల నిర్మాణం జరిగినా మరి కొంతమేర రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డుపై ఎమ్మెల్యే బాలరాజు, పీఓ ఆర్‌వీ సూర్యనారాయణ కొంత మేర ద్విచక్ర వాహనంపై, మరి కొంతమేర కాలినడకన నిత్యావసర వస్తువులు మోసుకుంటూ వెళ్లి మోతుగూడెం గిరిజనులకు అందించారు. 

మోతుగూడెంలో ప్రభుత్వ పథకాల అమలుపై కొండరెడ్డి గిరిజనులను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే బాలరాజు
గొడ్డు కారంతో భోజనం
భోజన సమయం దాటే సరికి మోతుగూడెం చేరుకున్న ఎమ్మెల్యే బాలరాజు, పీఓ సూర్యనారాయణ గ్రామానికి చెందిన గోగుల కమలమ్మ అనే కొండరెడ్డి గిరిజన మహిళ ఇంట్లో గొడ్డు కారంతో భోజనం చేశారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం అందించిన సాయం మర్చిపోలేమని కమలమ్మ ఆనందం వ్యక్తం చేసింది. విపత్తు సమయంలోనూ పథకాలు ఇంటి వద్దకే రావడం చాలా బాగుందని ఆమె చెప్పారు. పార్టీ నాయకులు ఆరేటి సత్యనారాయణ, కరాటం కృష్ణస్వరూప్, అల్లూరి రత్నాజీరావు, గగ్గులోతు మోహన్‌రావు, కారం వాసు, యాక్షన్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ గురుదత్త ప్రసాద్,కోఆర్డినేటర్‌లు టి.జ్యోతిబాబు, ఎం.సాల్మన్‌ రాజు, జి.మోహన్, కిరణ్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top