
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కంబాల జోగులు
రాజాం : రాష్ట్రానికి సీబీఐ రాకుండా జీఓ జారీచేయడం వెనుక ఆంతర్యమేంటని రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడును వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు ప్రశ్నించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి సీబీఐ వస్తుందంటే టీడీపీ నేతలు అంతా భయపడుతున్నారని ఆరోపించారు. అక్రమాలు, హత్యలు చేసే ముందు ఈ భయం ఉంటే బాగుండేదని అన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్ర, రాష్ట్ర నిధులు దుర్వినియోగం చేస్తూ అడ్డంగా ఆస్తులు సంపాదించిన టీడీపీ నేతలకు ఇప్పుడు ఆ అక్రమ ఆస్తులు ఎక్కడ బయటపడతాయోనని భయపడుతున్నారని విమర్శించారు.
ప్రజలు బాబును నమ్మడం లేదని, అందుకే జగన్‌పై కూడా హత్యాయత్నం చేయించారని తెలిపారు. జగన్ మళ్లీ ప్రజా బాట పట్టారని, జిల్లాకు త్వరలోనే రానున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రాజాం మండల కన్వీనర్ లావేటి రాజగోపాలనాయుడు, వంగర మండలం కన్వీనర్ కరణం సుదర్శనరావు, రాజాం టౌన్ యూత్‌కన్వీనర్ వంజరాపు విజయ్‌కుమార్, పార్టీ నాయకులు యాలాల వెంకటేష్, కార్యదర్శి శాసపు వేణుగోపాలనాయుడు, గొర్లె నారాయణరావు, దాలినాయుడు, పాలవలస రాజగోపాలనాయుడు, రాగోలు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.