ఉద్యోగాలిస్తారా.. మూసేసుకుని వెళ్తారా?

Mla Kakani Govardhan Reddy Fires On Local Industries Nellore  - Sakshi

సాక్షి, వెంకటాచలం(నెల్లూరు) : స్థానికంగా ఉంటున్న నిరుద్యోగ యువతకు పరిశ్రమల్లో ఉద్యోగాలివ్వండి.. లేదంటే పరిశ్రమలను మూసుకుని వెళ్లండని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరిశ్రమల యాజామాన్యాలను హెచ్చరించారు. వెంకటాచలం మండలం సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పలుశాఖల పనితీరుపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ముందుగా పరిశ్రమల్లో ఉద్యోగుల కల్పన గురించి చర్చించారు. కంపెనీల యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుంటే ఒప్పుకునే ప్రసక్తిలేదని హెచ్చరించారు. 70 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇస్తే ఇవ్వండి  లేదంటే పరిశ్రమలు మూసుకుని వెళ్లిపోవాలని హెచ్చరించారు.

బయట నుంచి వచ్చిన వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ స్థానికులను నిర్ణక్ష్యం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పకోమని హెచ్చరించారు. అనంతరం తాగు, సాగునీరుకు సంబంధించిన సమస్యల గురించి ప్రస్తావించారు. రామదాసుకండ్రిగకు సాగునీరు సరఫరాకు సంబంధించి కాలువ తవ్వించడంలో జాప్యంపై స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు షేక్‌ షాజహాన్‌ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కాలువ తవ్వకాలకు సంబంధించిన పనులు ప్రారంభించాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ముసుగులో అవినీతి అధికంగా జరిగిందన్నారు.
ప్రజా దోపిడీపై విచారణ చేయిస్తాం
నీరు–చెట్టు పథకం కింద అవసరంలేని చోట పనులు కల్పించి దోచుకుతిన్నారని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. వివిధ పథకాల పేరుతో జరిగిన దోపిడీపై విచారణ జరిపిస్తామన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల ప్రమేయంతో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. గత ఐదేళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా ప్రజల సమస్యలపై పోరాడడంలో ఎక్కడా రాజీపడలేదన్నారు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని చెప్పారు. ఉగాది సందర్భంగా రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి హామీలిచ్చాం.. ఏం అమలు చేస్తున్నామని నిత్యం పరిశీలిస్తున్నారని తెలిపారు. దేశ చరిత్రలో మహిళను హోంమంత్రిగా నియమించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాగా, దళిత మహిళను హోంమంత్రి చేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రివర్గంలో 60 శాతం చోటు కల్పించింది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు శ్రీధర్‌నాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీడీఓ ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ రమణానాయక్, ఈఓపీఆర్డీ రవీంద్రబాబు, జిల్లా, మండల కో–ఆప్షన్‌సభ్యులు అక్బర్‌భాషా, హుస్సేన్‌ పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top