
దళితుల కోసం..
అక్రమ కేసులో అరెస్ట్ చేసిన దళితుల్ని వదిలిపెట్టాలంటూ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రెండు
- రెండు రోజులు పోలీస్‌స్టేషన్‌లోనే చెవిరెడ్డి బైఠాయింపు
- అరుగుపైనే నిద్ర..
పుదిపట్ల(తిరుపతి రూరల్): అక్రమ కేసులో అరెస్ట్ చేసిన దళితుల్ని వదిలిపెట్టాలంటూ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రెండు రోజులపాటు ముత్యాలరెడ్డిపల్లి పోలీస్‌స్టేషన్‌లోనే బైఠాయించారు. అమాయకులను వదిలి పెట్టేవరకు తాను పండుగ చేసుకోనని భీష్మించుకున్నారు. బాధితులతోనే కలసి పోలీస్‌స్టేషన్ అరుగుపైనే నిద్రించారు.
రెండు రోజులపాటు వారితోనే ఉండి న్యాయపరంగా విడిపించుకుని ఇంటికి తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్లితే.. సీఎం చంద్రబాబు సంక్రాంతికి నారావారిపల్లెకు వస్తున్నారని టీడీపీ కార్యకర్తలు కట్టిన ఫ్లెక్సీలను చించారనే అనుమానంతో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పుదిపట్ల పంచాయతీ దళితవాడకు చెందిన మణి, భానుప్రకాష్, నవీన్‌కృష్ణ, గోపాలకృష్ణ, జగపతి, బాలలపై మాజీమంత్రి గల్లా అరుణకుమారి వర్గీయులు ఇటీవల దాడి చేసి, వారు ప్రయాణిస్తున్న కారు అద్దాల్ని ధ్వంసం చేసిన సంగతి విదితమే. ఈ దాడి గురించి ఫిర్యాదు చేస్తే స్వీకరించని పోలీసులు, గల్లా వర్గీయులిచ్చిన ఫిర్యాదుపై బాధితులపైనే కేసు నమోదు చేసి వారినే అరెస్ట్‌చేశారు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి వారికి అండగా స్టేషన్‌లోనే ఉన్నారు. కోర్టునుంచి బాధితులకు బెయిల్ మంజూరయ్యాక వారితో కలసి ఎమ్మెల్యే వెళ్లారు.