పెట్రోలు ధర పెంచడం దారుణం

MLA Anil Kumar Yadav Slams Chandrababu Naidu - Sakshi

నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌  

నెల్లూరు(సెంట్రల్‌):  పెట్రోలు ధరలను మరోసారి పెంచి ప్రజలపై భారం మోపడం దారుణమని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. నగరంలోని 7వ డివిజన్‌ మైపాడుగేటు సెంటరు, సాయిబులపాళెం, కుమ్మరవీధి ప్రాంతాల్లో ప్రజాదీవెన కార్యక్రమాన్ని డిప్యూటీమేయర్‌ ముక్కాల ద్వారకానాథ్‌తో కలసి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలపై భారం మోపాయన్నారు. అంతర్జాతీయంగా పెట్రోలు, డిజిల్‌కు సంబం ధించి క్రూడ్‌ ఆయిల్‌ ధర తగ్గుతున్నా కూడా ప్రభుత్వాలు మాత్రం ధరలు పెంచుకుంటూ పోతున్నాయన్నారు. మన చుట్టుపక్కల రాష్ట్రాలకంటే ఆంధ్రాలో లీటర్‌కు రూ.2 నుంచి రూ.3 అదనంగా ఎందుకు పెంచుతున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

జాతీయ రహదారిపై వెళుతున్నలారీలు, తదితర వాహనాల డ్రైవర్లు డీజిల్‌ ధర తక్కువగా ఉన్న పక్కరాష్ట్రాలలో పట్టించుకుంటున్నారన్నారు. దీనివల్ల మనరాష్ట్రంలో పెట్రోలు బంకులకు నష్టం వచ్చే పరిస్థితి ఉందన్నారు. మనరాష్ట్రంలో చమురు ధరలు పెంచేసి కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపతూ రాష్ట్ర ప్రభుత్వం దొంగనాటకాలు ఆడుతోందని మండిపడ్డారు.  వారంరోజుల క్రితం గుంటూరులో జరిగిన మైనార్టీలసభలో అలెగ్జాండర్‌ను రాష్ట్రపతిని చేసింది తానే అంటూ  చంద్రబాబు మతిస్థిమితం లేని విదంగా మాట్లాడుతున్నారన్నారు. ఆ సభలో తమకు రావాల్సిన పథకాలు అందలేదని శాంతియుతంగా నిరసన తెలిపిన ముస్లింయువకులపై దేశద్రోహులుగా అన్నట్లు కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు.  ముక్కాల ద్వారకానాథ్‌ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ భరోసా, నమ్మకం కలిగించే విధంగా నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ జెండా ఆవిష్కరించారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దామవరపు రాజశేఖర్, ఓబిలి రవిచంద్ర, నాయకులు రఫి, నాగభూషణం, సందీప్, తంబి, బత్తా కోటేశ్వరరావు, రాములు, తేజ, వంశీ, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, నాగరాజు, మద్దినేని శ్రీధర్‌ పాల్గొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top