విద్వేషాలు పెంచే నిర్ణయాలు తగవు | Minister K Jana Reddy angry on CM | Sakshi
Sakshi News home page

విద్వేషాలు పెంచే నిర్ణయాలు తగవు

Sep 5 2013 4:01 AM | Updated on Jul 29 2019 5:31 PM

విద్వేషాలు పెంచేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండకూడదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు.

సాక్షి, హైదరాబాద్: విద్వేషాలు పెంచేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండకూడదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఈ నెల 7వ తేదీన ఉద్యోగ సంఘాలు సభలు, ర్యాలీలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వరాదని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.  సున్నితమైన ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో లేదా సహచర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చినందుకు జానారెడ్డి పరోక్షంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై మండిపడ్డారు. గతంలో టీ జాక్ సమావేశాలకు అనుమతి ఇవ్వకుంటే.. మంత్రులపై ఒత్తిడి తెచ్చి ఒకటి రెండుసార్లు అనుమతి తీసుకున్నారని, ఇప్పుడు అనుమతి ఎలా వచ్చిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
 
 నేడు ఢిల్లీకి జానారెడ్డి
 జానారెడ్డి గురువారం ఉదయం ఢిల్లీ వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఢిల్లీలో కొనసాగుతున్న పరిణామాలు,  ఏపీ ఎన్జీఓల బహిరంగసభకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తదితర అంశాలపై అధిష్టానం పెద్దల వద్ద మాట్లాడనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తరువాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఫిర్యాదుచేసే అవకాశముందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement