మోడల్‌ స్కూల్‌లో ఆకలికేకలు

midday Meal Scheme Stopped in Model Schools Chittoor - Sakshi

మధ్యాహ్న భోజనానికి స్వస్తి

ఆకలితో అలమటించిన విద్యార్థులు

రూ.31వేల బకాయిలు పాత నిర్వాహకుల ఖాతాలోకి!

లబోదిబోమంటున్న ప్రస్తుత భోజన కార్మికులు

చిత్తూరు , నిమ్మనపల్లె: మండలంలో రెడ్డివారిపల్లె సమీపంలోని మోడల్‌స్కూల్‌లో బుధవారం నుంచి మధ్యాహ్న భోజన పథకానికి మంగళం పాడారు. దీంతో ఇక్కడి 316 మంది విద్యార్థులు ఆకలితో అలమటించారు. కొందరు ఇళ్ల నుంచి క్యారియర్‌లో భోజనం తెచ్చుకున్నారు. వివరాలు...ఈ ఏడాది ఆగస్టు నుంచి నిమ్మనపల్లెకు చెందిన జి.వెంకటరత్నమ్మ, అగ్రహారానికి చెందిన జి.రాణి మోడల్‌స్కూల్‌లో మధ్యాహ్న భోజన నిర్వాహకులుగా పని చేస్తున్నారు. వీరు పని చేసిన నెల రోజులకు సంబంధించి భోజన నిధులు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం మూలాన వీరి బ్యాంకు ఖాతాకు కాకుండా గతంలో పనిచేసిన వారి ఖాతాకు రూ.31వేలు ఇటీవల జమ అయ్యాయి.

ఇది ప్రస్తుత నిర్వాహకులకు తెలియలేదు. మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపల్‌కు సైతం ఇది తెలియకుండా విద్యాశాఖ అధికారులు జాగ్రత్తలు పడ్డారు. అంతేకాకుండా సెప్టెంబరు, అక్టోబరు మాసాలకు వచ్చే నిధులు సైతం సీఎఫ్‌ఎంఎస్‌లో పాతఖాతానే విద్యాశాఖ అధికారులు ఆన్‌లైన్‌ చేశారు. దీంతో ప్రస్తుత నిర్వాహకులకు మూడు నెలల బకాయిలు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే ప్రస్తుత నిర్వాహకులకు రూ.1.20 లక్షల బకాయిలు అందాల్సి ఉంది. తమకు రావాల్సిన నిధులు పక్కదారి పట్టించడంపై బాధితులు ఎంఈఓ రాజ గోపాల్‌ను సంప్రదించినా స్థానిక  టీడీపీ నాయకులను సంప్రదించాలని ఉచిత సలహా ఇచ్చారు. తమ కష్టార్జితాన్ని తేరగా కొట్టేస్తే పురుగులు పట్టిపోతారంటూ వారు శాపనార్థాలు పెట్టారు. ఈ వి షయమై వివరణ కోరేందుకు ఎంఈవోను ఫోన్‌లో పలుమార్లు ప్రయత్నించినా స్పందించలేదు.

ఖాతా మార్పు వివరాలునాకు తెలియదు
మధ్యాహ్న భోజన బకాయిలు జమ అవుతున్న ఖాతా వివరాలు నాకు తెలియవు. ఇక్కడ సమర్పించిన వివరాల్లో మదనపల్లె హెచ్‌డీఎఫ్‌సీ వివరాలు ఉండటం వాస్తవమే. ఖాతా మార్పు జరిగినప్పుడు మాకు విద్యాశాఖ అధికారులు తెలియజేయలేదు. తెలియకుండా మరో ఖాతాకు నిధులు జమ కావడంపై బాధితులు నా దృష్టికి తెచ్చారు.– ఎంవీ.ఎస్‌ఎన్‌.మూర్తి,ప్రిన్సిపల్, మోడల్‌స్కూల్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top