భోజనం కరువు

Midday Meal Scheme Delayed in Chittoor - Sakshi

37 మండలాల్లో మధ్యాహ్న భోజనం అమలు

80 శాతం పాఠశాలలకు అందని బియ్యం

గత ఏడాది బిల్లులే చెల్లించని వైనం

నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ శాఖ

ఎండదెబ్బకు హాజరుకాని విద్యార్థులు

మోడల్‌ స్కూల్స్‌లో అసలుకే మోసం

అయోమయంలో ఉపాధ్యాయులు, కార్మికులు

అవగాహన లేమి.. అధికారుల అత్యుత్సాహం.. పాలకుల నిర్లక్ష్యం వెరసి మధ్యాహ్న భోజన పథకం అభాసుపాలైంది. కరువు మండలాల్లో ప్రారంభమైన రెండో రోజే పాఠశాలలన్నీ వెలవెలబోయాయి. ఎండదెబ్బకు పిల్లల హాజరు శాతం తక్కువగా కనిపించింది. దీనికితోడు 37 మండలాల్లో 80 శాతం పాఠశాలలకు బియ్యం సరఫరా చేయలేదు. ఏం చేయాలో దిక్కుతోచక భోజన కార్మికులు చేతులెత్తేశారు. ఉపాధ్యాయులు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో విద్యార్థులు పస్తులతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలో 2016–17లో కరువు మండలాలన్నింటిలో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అప్పుడు చాలామంది విద్యార్థులు హాజరుకాలేదు. ప్రస్తుతం వేసవి సెలవుల్లో జిల్లాలోని 37 మండలాల్లో ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులుఆదేశించారు. ఈ నెల 25 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. సెలవులు ప్రకటించిన తర్వాత మధ్యాహ్న భోజనం అమలు చేయాలని నిర్ణయించారు. ఫలితంగా ఈ పథకానికి ఆదరణ లేకుండా పోయింది. ఏ పాఠశాలలో చూసినా పదుల సంఖ్యలోనే కనిపిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో అయితే ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

15 శాతం దాటని హాజరు
జిల్లాలోని 37 మండలాల్లో ఉన్న పాఠశాలల్లో 15 శాతం కూడా హాజరుకావడం లేదని సమాచారం. గంగాధరనెల్లూరు మండలంలో శుక్రవారం 107 స్కూళ్లకు 67 స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని పెట్టారు. ఆయా పాఠశాలల్లో 175 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో ఉన్న 18 మోడల్‌ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదు. గురుకుల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోనూ అదే పరిస్థితి. మధ్యాహ్న భోజనం అమలవుతున్న మండలాల్లో పాఠశాలల వారీగా చూస్తే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు ఒకటి, రెండు సంఖ్యల్లో వస్తున్నారు. ప్రాథమికోన్నత, హైస్కూళ్లలో అసలు విద్యార్థులే రావడం లేదని విద్యాశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ పథకంపై గ్రామాల్లోని ఎస్‌ఎంసీలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సంబంధిత ఎంఈఓలు అవగాహన కల్పిస్తే గానీ హాజరుశాతం పెరిగే సూచనలు కనిపించడం లేదు.

గత ఏడాది బియ్యం సరఫరా
గత విద్యా సంవత్సరంలో వేసవి సెలవుల్లో మధాహ్న భోజనాన్ని పెట్టకుండా విద్యార్థులకు బియ్యాన్ని సరఫరా చేశారు. ఈ ఏడాది అలా చేయలేదు. మధ్యాహ్న భోజనాన్ని కచ్చితంగా పెట్టాలని నిర్ణయించారు. ఒకవైపు శ్రమ, మరో వైపు నిధుల దుబారా తప్పితే ఒరిగేదేమీ లేదని విద్యావేత్తలు అంటున్నారు. గత ఏడాదిలాగే బియ్యం, కోడిగుడ్లను సరఫరా చేసి ఉంటే, ఇళ్లలో చేసుకుని తినేవారని చెబుతున్నారు.

పాఠశాలలకు సరఫరాకాని బియ్యం
జిల్లాలోని 37 మండలాల్లో 80 శాతం పాఠశాలలకు ఇప్పటికీ బియ్యం సరఫరా చేయలేదు. ఆయా పాఠశాలల్లో భోజన పథకం అమలు కావడం లేదు. జిల్లా సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయం నుంచి కరువు మండలాలుగా నిర్ణయించిన పాఠశాలలకు బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. 2016–17లో వేసవిలో పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యానికి విద్యాశాఖ నుంచి ఇప్పటికీ నిధులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఈ సారి చాలా పాఠశాలలకు బియ్యం సరఫరా చేయకుండా అలసత్వం చూపిస్తున్నట్లు సమాచారం.

బియ్యం, పప్పు పిల్లలకు ఇచ్చేస్తే మేలు
కరువు మండలాల్లో ఉన్న ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు బియ్యం, పప్పు, కోడిగుడ్డు ఇచ్చేస్తే మేలు. 2016 వేసవి సెలవుల్లో అలా చేశారు. ఈసారేమో మధ్యాహ్న భోజనం పెట్టే పద్ధతిని అమలు చేస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులు హాజరుకావడం లేదు. ఇలా చేస్తే ఎవరికి లాభం. ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు పునరాలోచించి మరో నిర్ణయం తీసుకుంటే మేలు కలుగుతుంది.– గిరిప్రసాద్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు

దూరం నుంచి విద్యార్థులు రాలేకపోతున్నారు
మండలాల్లో విద్యార్థులు హైస్కూల్‌కు రావాలంటే సమీపంలోని 5 కి.మీల నుంచి రావాల్సి ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల  రాలేకపోతున్నారు. ఎండల తీవ్రత వల్ల వేసవి సెలవులు ఇచ్చారు. ఇప్పుడేమో పాఠశాలలకు వచ్చి భోజనం చేసి వెళ్లమంటే ఎలా. విద్యార్థులు స్కూళ్లకు సైకిళ్లు తొక్కుకొని, నడిచి రావాల్సి ఉంటుంది. వారిని ఎండలో ఇబ్బంది పెట్టడం సరికాదు. పర్యవేక్షణ చేసే టీచర్లకు గౌరవవేతనం రూ.2 వేలు ఇస్తామన్నారు. అలా కాకుండా నిబంధనల ప్రకారం వేసవి సెలవుల్లో పనిచేసే టీచర్లకు ఈఏలు ఇవ్వాలి.  – జీవీ రమణ, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top