మైక్రో ఏటీఎంలు వచ్చేశాయ్‌ | Sakshi
Sakshi News home page

మైక్రో ఏటీఎంలు వచ్చేశాయ్‌

Published Tue, Nov 21 2017 7:58 AM

Micro ATM services - Sakshi

జంగారెడ్డిగూడెం : జిల్లాలో మైక్రో ఏటీఎంలు వచ్చేశాయి. కేవలం ఆధార్‌కార్డుతోనే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. గత ఏడాది నవంబర్‌ 8 ముందు వరకు ప్రజలు నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే ఏటీఎంలపై ఆధారపడే వారు. నవంబర్‌ 8న పెద్ద నోట్ల రద్దు తరువాత ఒక్కసారిగా నగదు కష్టాలు వెక్కిరించాయి. సుమారు అటూ, ఇటుగా నాలుగు నెలల పాటు ఏటీఎంలు పనిచేయలేదు. ఆ తరువాత ఒకొక్కటికిగా పనిచేయడం ప్రారంభించినా నగదు ఇబ్బందులు మాత్రం తీరలేదు. ఆ పరిస్థితి ఏడాది గడిచినా ఇప్పటికీ అలాగే ఉంది.

ఈ నేపథ్యంలో మైక్రో ఏటీఎంలు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. ఏటీఎం కార్డుతోపాటు, ఆధార్‌కార్డు సహాయంతో నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఏర్పడింది. దీంతో ప్రజలు మెల్లమెల్లగా మైక్రో ఏటీఎంల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటికే జంగారెడ్డిగూడెం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం తదితర పట్టాణాల్లో మైక్రో ఏటీఎంలు అందుబాటులో కి వచ్చాయి. ఈ మైక్రో ఏటీఎంలలో కార్డు లేకపోయినా ఆధార్‌ నెంబరుతో నగదును విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డు దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఏ బ్యాంకు ఏటీఎం కార్డు ద్వారా అయినా ఈ మైక్రో ఏటీఎంల ద్వారా నగదు పొందవచ్చు.

మైక్రో ఏటీఎంల సేవలు:
 ఆధార్‌కార్డు నంబరు అనుసంధానమైన ఏ బ్యాంకు అకౌంట్‌ నుంచైనా నగదును ఈ మైక్రో ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

 ఏ బ్యాంకు ఏటీఎం కార్డు (డెబిట్‌ కార్డు) ద్వారానైనా నగదు డ్రా చేసుకోవచ్చు.

 ఐడీఎఫ్‌సీ బ్యాంకుకు సంబంధించి కొత్త అకౌంట్‌ను ప్రారంభించుకోచ్చు.

 ఈ మైక్రో ఏటీఎం ద్వారా ఏ బ్యాంకు ఖాతాలోనైనా నగదు జమచేసుకోవచ్చు. అయితే దీనికి 1.5 శాతం సర్‌ఛార్జ్‌ పడుతుంది. 

 ఆధార్‌ నంబరు ద్వారా ఏ బ్యాంకు అకౌంట్‌ బ్యాలెన్స్‌ అయినా తెలుసుకోవచ్చు. 

 బ్యాంకు సమయాలు, సెలవు రోజులతో సంబంధం లేకుండా సేవలు పొందవచ్చు.

 బ్యాంకు అకౌంట్‌ ఉన్న వ్యక్తి ఆధార్‌ నెంబరు తీసుకువెళితే మైక్రో ఏటీఎం ద్వారా ఆధార్‌నెంబరుతో, ఖాతాదారుడి వేలిముద్రతో నగదు డ్రా అవుతుంది. దీంతో ఎటువంటి మోసాలకు తావు ఉండదు. 

Advertisement
Advertisement