
పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని కియా కార్ల తయారీ పరిశ్రమ అనుబంధ స్క్రాప్ కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐదు వాహనాలు కాలిపోయి భారీ ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదాన్ని అదుపు చేసే సమయంలో తీవ్ర టెన్షన్‌కు గురై కియా ఫైర్‌స్టేషన్ మేనేజర్ పరంధామ (45) మృతి చెందాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆవరణలోని ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన అక్కడి వాహన యజమానులు, కొందరు కూలీలు, గ్రామస్తులు రెండు వాహనాలను బయటకు తరలించగా మిగిలిన ఐదూ దగ్ధమయ్యాయి. సమీపంలోని రైతుల గడ్డివాములు కూడా కాలిపోయాయి. ప్రమాదంలో స్క్రాప్ కేంద్రంలో రూ.కోటికి పైగా నష్టం వాటిల్లుంటుందని అంచనా. ట్రాన్స్‌కోకు రూ.3లక్షలు నష్టం జరిగిందని ఏఈ పరమేశ్వరరెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి శంకరనారాయణ పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.